
నల్గొండ: సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కీలక విషయాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటికి దొంగతానికి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో గోడదూకి ఇంట్లో ప్రవేశించి చోరీకి పాల్పడిన విద్యార్థిని రూపారెడ్డి గుర్తించడంతో తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఆమెను హత్య చేశాడన్నారు. స్కూల్ ఫీజుల వసూళ్లు జరుగుతుండటంతో ప్రిన్సిపల్ ఇంట్లో డబ్బు ఉంటుందని భావించి ఐదు రోజుల ముందు నుంచే చోరీకి ప్లాన్ చేశారన్నారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో హత్య కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు.
‘‘రూపారెడ్డి హత్య కేసుపై ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టాం. దీని వెనుక పాత నేరస్థులు, సైకోలు ఉన్నారేమోనని విచారించాం. ఆ ప్రాంతంలోని సుమారు 70 సీసీ కెమెరాలను పరిశీలించాం. వాటి ఆధారంగానే పారిపోతున్న నిందితులను గుర్తించాం. రూపారెడ్డి చివరిసారిగా ఆమె పిన్నితో మాట్లాడుతూ బాబు అనే పదం వాడారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టాం. ఎవరితో ఆమె అలా మాట్లాడారనే విషయంపై ముందుకెళ్లాం. స్కూల్లో పిల్లలను కూడా అలా అంటారేమోనని అక్కడ విచారించాం. ప్రిన్సిపల్ హత్య తర్వాత నాలుగురోజులు ఆ స్కూల్‌కు సెలవులు ఇచ్చారు. రీఓపెన్ తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థుల గురించి ఆరా తీశాం. వారిలో ఐదుగురు పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. అందులో ఇద్దరు రెండు మూడు రోజుల నుంచి డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించాం. నిందితుల్లో ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్ ఉన్నట్లు గుర్తించాం. నగదు ఎక్కడిదని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చినట్లు చెప్పాడు. ఆ నోట్లపై రక్తపు మరకలు ఉన్నాయి. వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తే మనిషి రక్తంగా తేలింది.
నిందితుల్లో ఒకడు అదే స్కూల్ హాస్టల్లో ఉండేవాడు. గతంలో అతడి బ్యాగ్‌లో కొంత డబ్బు, సెల్‌ఫోన్ దొరకడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి, టీచర్లు మందలించి డేస్కాలర్‌గా మార్చారు. ఆ సమయంలో తల్లిదండ్రుల ముందు అతడిని మందలించారు. ఈ క్రమంలో ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్నాడు. నిందితుడికి ఆల్కహాల్ అలవాటు, బైక్‌లపై మోజు ఉంది. నెల క్రితం గోవా టూర్‌కి వెళ్లాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశతో ఐదురోజుల ముందు నుంచే రూపారెడ్డి ఇంట్లో దొంగతనానికి ప్లాన్ వేసుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏ సమయంలో చోరీ వెళ్లాలనే విషయాలపై చర్చించుకున్నారు. ఈనెల 11న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నిందితులు ఇద్దరూ కలిసి ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లారు. అందులో ఒకరు మాస్క్ పెట్టుకుని గోడదూకి లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో మాస్క్ ఊడిపోవడం, ప్రిన్సిపల్ గుర్తుపట్టడంతో ఆమెను హత్య చేశాడు. 27 సార్లు కత్తితో పొడిచాడు. ఆ సమయంలో ఆమె ఫోన్ కిందపడటంతో దాన్ని తీసుకెళ్లిపోయారు. నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదుతో పాటు ఐఫోన్, రూపారెడ్డి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నాం. నిందితులు మైనర్లు అయినందున వారిని జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపిస్తాం’’ అని ఎస్పీ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



