
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Laldarwaza Simhavahini Bonalu 2026: హైదరాబాద్ బోనాలు ఎంతో విశిష్టమైనవి, వీటిని ఆషాఢ బోనాల్లో చివరి ఘట్టంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు హైదరాబాద్ లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. రాత్రి నుంచే భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం రేపు కూడా అధికారిక సెలవు ప్రకటించింది. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో బోనాలను నిర్వహిస్తారు, ముఖ్యంగా చివరి ఆషాడ ఆదివారం లాల్ దర్వాజా బోనాలతో ముగుస్తుంది. నగరంలోని మొత్తం 3500 ఆలయాల్లో ఈరోజు బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు భారీ బందోబస్తు, ట్రాఫిక్ నిబంధనలను కూడా అమలు చేశారు. అన్ని ఆలయాల వద్ద అమ్మవారి పాటలతో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుతున్నారు.
రేపు సెలవు.. హైదరాబాద్ బోనాల ఉత్సవాలు నగరవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో బోనాల వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాల సందర్భంగా సోమవారం ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున, అక్కడ ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఘనంగా బలిహరణం.. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి బలిహారణం దేవి అభిషేకం నిర్వహించారు. అనంతరం బోనాలు సమర్పించడం ప్రారంభమైంది. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించగా, విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ, సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.
బలిహరణం ఎలా మారిందంటే? పూర్వకాలంలో లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో బలిగంపకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది. పెద్దల కథనం ప్రకారం, అప్పట్లో గేదెలను అమ్మవారికి బలిగా సమర్పించేవారు. అయితే ప్రస్తుతం జంతుబలికి బదులుగా గుమ్మడికాయ కొట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ఆనవాయితీ కొనసాగుతోంది. గౌలిపుర ఉప్పు, మురద మహల్ వంటి ఇతర ప్రాంతాల ఆలయాల్లోని బలిగంప కార్యక్రమాలు రాత్రి రెండు గంటలకే ప్రారంభమై, ఉదయం 6 గంటల లోపు ముగుస్తాయి.
నగరంలోని ప్రధాన ఆలయాలన్నింటికీ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. పాత బస్తీలోని సింహవాహిని మహంకాళి, హరిభౌలి అక్కన్న మాధన్న, కోవబేట బంగారు మైసమ్మ, రాంబాక్షి బండ బంగారు మైసమ్మ, బేట చందుల మాతేశ్వరి, ముత్యాలమ్మ, గౌలిపుర మహంకాళి, మాతేశ్వరి భారతమాత, కోట మైసమ్మ, సుల్తాన్ షాహి జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి దర్బార్ మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి, తదితర ప్రధాన ఆలయాలను ఎంతో అందంగా ముస్తాబు చేశారు. పలు ఆలయాల్లో మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
రేపు రంగం.. ఫలహారం బండి ఊరేగింపు.. సోమవారం రంగం బలిగంప కార్యక్రమాలతో పాటు, ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెల ఫలహారపు బండ్ల ఊరేగింపు కొనసాగుతుంది. ఈ నెల 13న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొమ్మిదవ పూజ అనంతరం ఆషాడ బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. బోనాల నేపథ్యంలో ఆలయాల వద్ద ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించడమే కాకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.