పాపం జ్యోత్స్న ఓసారి బావ చేతిలో మోసపోయింది. చిన్నప్పటి నుంచి బావపైనే బోలెడు ఆశలు పెట్టకుంది. అతనే ప్రాణం అనుకుంది. అతనితోనే ప్రేమ, పెళ్లి అనుకుని తన జీవితాన్నే త్యాగం చేసింది. చివరికి పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ.. దీప ఎంట్రీ ఇచ్చి కార్తీక్‌ని లాగేసుకుంది. ప్రాణం అనుకున్న మరదలు జ్యోత్స్నని కాదని.. ఆల్రెడీ పెళ్లై కూతురున్న దీప మెడలో తాళి కట్టాడు కార్తీక్. వీళ్లిద్దరూ బాగానే ఉన్నారు కానీ.. జ్యోత్స్న మాత్రం బావపై పిచ్చి ఆశని వదలుకోలేదు. ఏనాటికైనా తన బావ తనవాడే అనుకుని పిచ్చి ఆశలు పెంచుకుంది. తన బావని దక్కించుకోవడం కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కుట్రలు చేసింది కానీ.. అవన్నీ ఫలించలేదు.అయితే అనూహ్యంగా ఆమె జీవితంలోకి సూరజ్ వచ్చాడు. అనాథగా వచ్చిన అతను.. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. బావపై ఉన్న పిచ్చి ఇష్టంతో అతని ప్రేమను తిరస్కరించింది జ్యోత్స్న. అయితే దీప, కార్తీక్‌లతో పాటు.. ఇంట్లో వాళ్లంతా పెళ్లికి బలవంతం చేయడంతో.. తన నుంచి సమాధానం రాకుండానే ఆమెను రిజెక్ట్ చేశాడు సూరజ్. నీ మనసులో నీ బావ ఉన్నాడు కాబట్టి.. నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు సూరజ్. అయితే రిజెక్ట్ని యాక్సెప్ట్ చేయలేకపోయిన జ్యోత్స్న.. తన మదిలో పథిలంగా నిలిచిపోతాడనుకున్న కార్తీక్ బావని చెరిపేసి.. సూరజ్‌ని తన మనసులో నింపుకుంది. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఒకరకంగా చెప్పాలంటే.. జ్యోత్స్నని ప్రేమ మైకంలోకి దింపేశాడు సూరజ్. తన ప్రేమలో నిండా మునిగేట్టు చేశాడు.అయితే ఇదంతా కార్తీకదీపంలో కనిపిస్తున్న కథ.. వినిపిస్తున్న వ్యధ. అయితే దీన వెనుక పెద్ద కథ నడుస్తోంది. ఈ సీరియల్ చూస్తున్న వాళ్లకి సూరజ్ ప్రవర్తన చూస్తే మొదటి నుంచి అనుమానంగాను ఉంటుంది. అతను అనాథ అని చెప్తున్నా కూడా.. అతనికి కథలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మాలిని, దక్షణమూర్తిలతో ఏదో రిలేషన్ ఉండే ఉంటుందని డౌటానుమానాలు కొడుతూనే ఉన్నాయి. మొదట్లో అయితే సూరజ్ ఎవరో కాదు.. దక్షణమూర్తి మనవడే అని సమయం తెలుగు ఊహించింది.దానికి మరింత బలాన్నిస్తూ నేటి (ఆగస్టు 18) ఎపిసోడ్లో మరికొన్ని హింట్స్ ఇచ్చారు. తన మనసులో మాట చెప్పడానికి సూరజ్ గదికి వెళ్తుంది జ్యోత్స్న. అప్పుడు గమనిస్తే.. ఒక షాట్లో ‘అంతా గుర్తుంది.. మనం అనుకున్నట్టే అవుతుంది.. ఉంటానూ’ అంటూ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు సూరజ్. ఇక ఎపిసోడ్ చివర్లో మాలిని, దక్షణమూర్తిలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మాటల్ని బట్టి చూస్తే.. ఖచ్చితంగా సూరజ్ వీళ్ల మనిషే అని అనుమానం రాకమానదు. వాళ్ల మధ్య సంభాషణ ఎలా జరిగిందంటే.. ‘మాలిని.. దక్షణమూర్తికి స్వీట్స్ ఇచ్చి సెలబ్రేట్ చేస్తుంది. మామూలుగా అయితే నాకు షుగర్ కాబట్టి.. స్వీట్స్ తినను. కానీ ఈరోజు తింటాను. ఒక్కటి కాదు రెండు స్వీట్స్ తింటాను అని అంటాడు దక్షణమూర్తి. ‘నేను చెప్పడానికంటే ముందు.. ఈరోజు ఏంటో మీకు గుర్తుందా మామయ్యా’ అని అంటుంది మాలిని. ‘ఎలా మర్చిపోతానమ్మా.. ఈరోజు మనకి పండగ లాంటి రోజు. కానీ జ్ణాపకాలతో గడపాల్సి వస్తుంది అని అంటాడు దక్షణమూర్తి.ఆ మాటతో మాలిని.. ‘తప్పదు మామయ్యా.. అనుకున్నది జరగాలంటే కొన్ని భరించాల్సిందే. కానీ ఇది ఎంతో కాలం కాదు.. సమయం దగ్గర పడింది’ అని అంటుంది మాలిని. ‘నాకు నా గురించి బాధ లేదమ్మా.. నా బాధ అంతా నీ గురించే.. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి బదులు తీర్చుకోవాల్సిందే’ అని అంటాడు దక్షణమూర్తి. మనం అనుకున్నది జరిగే రోజు చాలా దగ్గరలోనే ఉంది మామయ్యా.. గెలిచేది మనమే మామయ్యా.. మనం అనుకున్నదానికంటే గొప్ప విజయాన్ని అందుకోబోతున్నాం మామయ్యా.. ఇది అతి విశ్వాసం కాదు మామయ్యా.. అంతా ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. గాల్లో దీపం పెట్టి దేవుడే దిక్కు అనే పరిస్థితి లేదు.. మనం పెట్టిన దీపాన్ని మనమే రక్షిస్తున్నాం.. దాన్ని ఏ గాలి ఆపలేదు’ అని అంటుంది మాలిని. అంటే ఆ దీపం ఎవరో కాదు ఖచ్చితంగా సూరజ్‌నే.వాళ్లు స్వీట్స్ పంచుకోవడానికి కూడా కారణం ఉంది. అదే సూరజ్ పుట్టినరోజు. ఓ పక్క సూరజ్ బర్త్ డేకి సర్ ప్రైజ్ చేసి అదే వేడుకలో పెళ్లికి ప్రపోజ్ చేయాలని చూస్తుంది జ్యోత్స్న. ఇక్కడ వీళ్లు స్వీట్స్ తినిపించుకోవడానికి కూడా అదే కారణం అయ్యి ఉంటుంది. అంటే.. సూరజ్ ఎవరో కాదు.. మాలిని కొడుకే అయ్యి ఉండొచ్చు. దక్షణమూర్తి మనవడే సూరజ్ అయినా అవ్వొచ్చు. జ్యోత్స్నని ప్రేమ పేరుతో నమ్మించి.. ఆమెను పెళ్లి చేసుకుని.. శివన్నారాయణని దెబ్బ కొట్టడానికి మాలిని వదిలిని అస్త్రమే ఈ సూరజ్ అయ్యి ఉండొచ్చు. చూద్దాం ఏమౌతుందో.




