
Karthika Deepam 2 Big Twist: తెలుగు టీవీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సీరియల్స్‌లో కార్తీక దీపం 2 కూడా ఒకటి. ప్రతిరోజూ కొత్త మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ కథ ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. దీప అసలు ఎవరు? ఆమెకు శివ నారాయణ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన పరిణామాలతో ఈ నిజం ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు.
కార్తీకదీపం రెండో భాగం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను.. తెగ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సీరియల్ కథలో దీపే శివ నారాయణ కుటుంబానికి అసలైన వారసురాలు అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. కార్తీక్, జ్యోత్స్న, పారిజాతం, దశరథ, దాసుకు ఈ విషయం గురించి అవగాహన ఉంది. దీపను ఆమె తల్లిదండ్రులకు దగ్గర చేయాలని కార్తీక్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ ప్రయత్నాలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ఇదిలా ఉంటే జ్యోత్స్న జీవితంలో సూరజ్ రావడంతో కథ మరో మలుపు తిరిగింది. సూరజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత దీపే అసలైన వారసురాలు అనే విషయాన్ని అందరికీ చెబుతానని జ్యోత్స్న నిర్ణయించుకుంది. దీంతో దీప తన కుటుంబానికి దగ్గరయ్యే సమయం వచ్చిందని ప్రేక్షకులు భావించారు. కానీ సూరజ్ విషయంలో వచ్చిన ట్విస్ట్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూరజ్ మాలినికి సంబంధించిన వ్యక్తి అని తెలియడంతో జ్యోత్స్న పెళ్లి ఆగిపోయింది. ఈ పరిణామానికి దీప, కార్తీక్ కారణమని కొందరు భావించే పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు ఇంతకాలం జ్యోత్స్నను తన కూతురిగా చూసుకున్న దశరథ కూడా ఒక్కసారిగా మాట మార్చాడు. జ్యోత్స్ననే తన కూతురని చెప్పడంతో దీప విషయంలో మళ్లీ గందరగోళం మొదలైంది. దీప తన సొంత కూతురనే విషయాన్ని బయటపెట్టకూడదని దశరథ నిర్ణయించుకోవడం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది.
దీంతో దీప అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందనే ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్లో మొదలైంది. దీప, కార్తీక్ కలిసి పరిస్థితిని ఎలా మార్చబోతారు? జ్యోత్స్న, సూరజ్ పెళ్లి మళ్లీ జరుగుతుందా? దీప తన కుటుంబానికి ఎప్పుడు దగ్గరవుతుంది? అనేది రాబోయే ఎపిసోడ్స్‌లో చూడాలి. అయితే అసలు నిజం బయటపడడానికి ఇంకా కనీసం 300 ఎపిసోడ్లు అవ్వచ్చు అని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం సీరియల్ కథ మళ్లీ మొదటి దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో మేకర్స్ కథను మరికొంత కాలం కొనసాగించే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరోవైపు వరుస ట్విస్టులతో కార్తీక దీపం 2 మరింత ఆసక్తిని పెంచుతోంది.




