
తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు దుబాయిలో పలువురు తెలంగాణ యువత జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సూచనల మేరకు, గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ జనసైనికులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా, గల్ఫ్ జనసేన ఇన్చార్జ్ కేసరి త్రిమూర్తులు ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 20 మంది తెలంగాణ యువత జనసేన పార్టీలో చేరగా, వారికి గల్ఫ్ జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ జనసైనికులు, వీర మహిళలు, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్న తెలంగాణ యువతను జనసేన పార్టీకి మరింత చేరువ చేయడం, పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనలో యువతను భాగస్వాములను చేయడం తమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. గల్ఫ్ నుంచి తెలంగాణ వరకు పార్టీ కార్యక్రమాలకు అవసరమైన సహకారం, సమన్వయం అందించే విధంగా ముందుకెళతామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గల్ఫ్ జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీమ్ సభ్యులు నున్నం రాజేష్, పొట్టిపోతు సుబ్రహ్మణ్యం, బండారు శివాజీ, సత్య తోలేటి, పెద్దిరెడ్డి పన్నాల తదితరులు పాల్గొని జనసేన పార్టీలో చేరిన తెలంగాణ యువతను అభినందించారు.
పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృభూమిపై తమ బాధ్యతను మరచిపోమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేనతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
‘విదేశాల్లో ఉన్నా మాతృభూమిపై మమకారం తగ్గదు. తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై అవగాహనతో జనసేనతో కలిసి పనిచేసేందుకు యువత ముందుకు రావడం అభినందనీయం. గల్ఫ్‌లో ఉన్న జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలి’ అని కేసరి త్రిమూర్తులు పిలుపునిచ్చారు.
దుబాయి వేదికగా గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణ వరకు జనసేన జెండాను మరింత బలంగా ఎగురవేయాలనే సంకల్పంతో యువత ముందుకు సాగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది తెలంగాణ యువతను జనసేనలో భాగస్వాములను చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.
అమెరికాలో డాక్టర్ రాజా కుమారుడి వివాహం.. హాజరైన మంత్రి నారా లోకేష్
బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు





