
రాహుల్ ద్రవిడ్ జీవితం నేటి తరం కుర్రాళ్లకో పెద్ద పాఠం. ఇదేదో కేవలం అతడి ఆటను ఉద్దేశించి మాత్రమే కాదండోయ్.. జట్టుకు ఎప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ ముందుండేవాడు. అందుకే అతడు ‘ది వాల్’గా మారాడు. మిస్టర్ డిపెండబుల్‌గా అందరితో పిలిపించుకొంటూ ఇప్పుడు ఓనర్‌గానూ మారిపోయాడు.
1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ద్రవిడ్ ( Rahul Dravid ) తొలుత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మిడిలార్డర్‌కు చేరాడు. కొన్నాళ్లకు వన్‌డౌన్‌లో కీలక ఆటగాడిగా మారిపోయాడు. సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌తో కలిసి భారత జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. టెస్టుల్లో గంటలతరబడి క్రీజ్‌లో పాతుకుపోయి ది వాల్‌గా అవతరించాడు. ప్రత్యర్థుల బౌలింగ్‌ను తట్టుకొని మిస్టర్ డిపెండబుల్‌గా నిలిచాడు. మరి బ్యాటింగ్‌కే అతడిపై ఇన్ని ప్రశంసలా? అని అనిపించకమానదు. కానీ, జట్టు కోసం ద్రవిడ్ చేసిన త్యాగాలు తక్కువేం కాదు.
ఇప్పుడంటే నాణ్యమైన వికెట్లు కీపర్లు (Team India Wicket Keepers) మనకు బోలెడు మంది. దినేశ్‌ కార్తిక్, ధోని రాక ముందు వరకూ దాదాపు ఆరేడేళ్లపాటు వికెట్ కీపర్ల విషయంలో మనకు గడ్డుకాలమే. ఎప్పుడైతే ధోని ( MS Dhoni ) అడుగు పెట్టాడో దాదాపు దశాబ్దన్నరపాటు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. కానీ, 1999 నుంచి 2004 వరకూ సరైన బ్యాటింగ్‌ కమ్‌ వికెట్‌ కీపింగ్‌ ప్లేయర్ లేడంటే నమ్మగలమా? నయాన్‌ మోంగియా ఉన్నా అతడు వికెట్ కీపింగ్‌లో ఫర్వాలేదు కానీ.. గొప్ప బ్యాటర్‌గా మాత్రం కాలేకపోయాడు. అప్పటికే ఆసీస్‌కు ఆడమ్ గిల్‌క్రిస్ట్, దక్షిణాఫ్రికాకు మార్క్‌ బౌచర్, శ్రీలంక తరఫున కుమార్ సంగక్కర వంటి అద్భుతమైన స్కిల్డ్‌ బ్యాటింగ్‌ కమ్‌ వికెట్‌ కీపర్లు ఉండేవారు.
దీంతో నాటి పరిస్థితులను బట్టి భారత్‌ ( Team India ) తన తుది జట్టులో అదనంగా బ్యాటర్‌ను తీసుకోవాలంటే ఎవరైనా బౌలర్‌పై వేటు వేయాల్సిన పరిస్థితి. అందుకోసం అప్పుడున్న ఆటగాళ్లలోనే ఒకరికి వికెట్ కీపింగ్‌ బాధ్యతలు ఇచ్చి.. అదనంగా స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకొనేందుకు మేనేజ్‌మెంట్ ఆలోచనలు చేసింది. ‘నేనున్నానంటూ’ ద్రవిడ్ ముందుకొచ్చాడు. అప్పటికి అతడేమీ అంతర్జాతీయంగా రెగ్యులర్ వికెట్‌ కీపర్‌ కాదు. అయినా సరే జట్టు కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇలా సుమారుగా 70కిపైగా వన్డేల్లో కీపింగ్‌ బాధ్యతలను నిర్వర్తించాడు. 2003 వన్డే ప్రపంచ కప్‌లోనూ పలు మ్యాచులకు కీపింగ్‌ చేశాడు.
క్రికెటర్‌గా కెరీర్‌ను ముగించిన రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid ) భారత జట్టుకు ప్రధాన కోచ్‌గానూ పనిచేశాడు. అంతకుముందు టీమ్‌ఇండియా A టీమ్‌కూ శిక్షణ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్‌లోనూ మెంటార్‌, కోచ్‌గా మారాడు. ఇటీవల ఓ లీగ్‌లో టీ20 జట్టుకు సహయజమాని కావడం గమనార్హం. యూరోపియన్‌ లీగ్‌లో ఓ జట్టు కొనుగోలులో అతడు భాగస్వామి.
చివరిగా: ప్రతిభ ఒక్కటే కాదు.. త్యాగం, కష్టం ఉన్న రాహుల్ ద్రవిడ్ క్రికెటర్‌గా తన కలను నెరవేర్చుకోవడం నుంచి ఓ జట్టుకు యజమానిగా మారడం వరకూ అతడి జీవితం ఇప్పటి తరానికి ఆదర్శప్రాయమే కదా.. తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకొనేందుకు చివరి వరకూ శ్రమించే ద్రవిడ్ నోట ఎప్పుడూ పరుష పదం రాలేదు. తన ఆటతోపాటు వ్యక్తిత్వమే అందుకు అందుకు సమాధానం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





