హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఈనెల 18వ తేదీ నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుందని వెల్లడించారు. హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా పార్క్ చుట్టూ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఈ ట్రాఫిక్ మార్పులు కొనసాగనున్నాయి.ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్ట్ 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్ల వద్ద వన్‌వే విధానం అమలు చేయనున్నారు. నిర్మాణ పనుల కారణంగా రహదారులపై అందుబాటులో ఉన్న స్థలం తగ్గిపోవడంతో వాహనాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడకుండా ఈ మార్పులు చేపట్టారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులో సుమారు 110 పిల్లర్లు నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేయనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్లలో నిర్దేశించిన దిశలోనే వాహనాలను అనుమతించనున్నారు. కొత్త మార్గాలను ముందుగానే తెలుసుకుని వాహనదారులు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వన్‌వే అమలు కోసం ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే రెండు దశల్లో ట్రయల్ రన్లు నిర్వహించారు.ఏప్రిల్ 5వ తేదీ, జూన్ 21వ తేదీన ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ మార్పులను పరిశీలించి.. ఆయా జంక్షన్ల వద్ద ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించారు. ఆ అనుభవాల ఆధారంగా లేన్ మార్కింగ్‌లు, లేన్ ఛేంజర్లు, దిశానిర్దేశక బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులకు మార్గదర్శకత్వం అందించేందుకు కీలక ప్రాంతాల్లో 24 గంటలూ ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ), సీసీటీవీ నెట్‌వర్క్‌ను ఉపయోగించనున్నారు. అంతేకాకుండా 2 డ్రోన్ల ద్వారా రియల్‌టైమ్ ట్రాఫిక్ పరిస్థితులను అధికారులు గమనించనున్నారు. అవసరాన్ని బట్టి వన్‌వే మార్గాల్లో మార్పులు, అదనపు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. గూగుల్ మ్యాప్స్ సహా నావిగేషన్ యాప్‌ల్లోనూ మార్గాలకు సంబంధించిన మార్పులను అప్డేట్ చేస్తున్నారు.కేబీఆర్ పార్క్ పరిసరాల్లో పలు కీలక ఆసుపత్రులు ఉండటంతో అత్యవసర సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనదారులు అత్యవసర వాహనాలకు తప్పనిసరిగా మార్గం ఇవ్వాలని పోలీసులు సూచించారు. కేబీఆర్ పార్క్‌కు వాకింగ్ కోసం వచ్చే వారికీ ఇబ్బందులు లేకుండా రోడ్డు దాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాకర్లు, సందర్శకులు రోడ్లపై వాహనాలను నిలిపివేయకుండా నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలను వినియోగించాలని సూచించారు.ఈ వన్‌వే విధానం సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగవచ్చని సీపీ సజ్జనార్ తెలిపారు. నిర్మాణ దశలో కొంతకాలం ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైనా.. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ రద్దీ తగ్గడం, ప్రయాణ సమయం ఆదా కావడం, రహదారి భద్రత మెరుగుపడటం వంటి ప్రయోజనాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ మార్పులను గమనించి ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని.. సోషల్ మీడియాలో వచ్చే అనధికార సమాచారాన్ని కాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సూచనలను మాత్రమే నమ్మాలని కోరారు.





