
రెవెన్యూ పోలీసు అవినీతి పై ఎప్పటికప్పుడు ఆరోపణలు, ఏసీబీ ట్రాప్ కేసులు, అక్రమాస్తుల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు నిజంగా ప్రజా సేవా కేంద్రాలుగానే పనిచేస్తున్నాయా? లేక ప్రజల అవసరాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్న లంచాల అడ్డాలుగా మారుతున్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు సామాన్య పౌరుడి ముందుంది. ఇందుగలడందులేడని సందేహము వలదు… చక్రి సర్వోపగతుండు… ఎందెందు వెతికినా అందందే గలడు… పోతన భాగవతంలోని ఈ భావం భగవంతుడి సర్వవ్యాప్తిని చెబుతుంది. కానీ నేటి పాలనా వ్యవస్థను చూస్తుంటే అదే మాటలను మరో విధంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందెందు వెతికినా… లంచం. ఎక్కడ చూసినా… అవినీతి ఆరోపణలు. ఏ కార్యాలయానికి వెళ్లినా… దళారుల నీడ. ఏ అనుమతి కావాలన్నా… దక్షిణ మాట. ఏ ఫైలు కదలాలన్నా… చేతులు తడపాల్సిందే అన్న నిస్సహాయత! ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించాలి. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలను ఆశ్రయిస్తారు. కానీ అదే అవసరాన్ని కొందరు అధికారులు లేదా మధ్యవర్తులు తమకు ఆదాయ మార్గంగా మార్చుకుంటే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. లంచం తీసుకోవడం తప్పే. లంచం ఇవ్వడం కూడా తప్పే. అయితే లంచం ఇవ్వకపోతే తన పని జరగదనే భయాన్ని ప్రజల్లో ఎవరు కల్పిస్తున్నారు? ఒక సాధారణ పౌరుడు తన హక్కుగా పొందాల్సిన ధ్రువపత్రం కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఒక ఫైల్ నిబంధనల ప్రకారం కదలడానికి అదనపు డబ్బు ఎందుకు అవసరం అవుతోంది? ఇదే అసలు ప్రశ్న. పన్ను చెల్లించే పౌరుడికి ప్రభుత్వం సేవ అందించాలి. అది ప్రభుత్వ వ్యవస్థ బాధ్యత. కానీ అదే సేవ కోసం లంచం అడిగితే అది ప్రజలపై పడుతున్న ఒక రకమైన ‘చీకటి పన్ను’గా మారుతుంది. ఈ పన్నుకు రసీదు ఉండదు. జీఎస్టీ ఉండదు. బడ్జెట్లో కనిపించదు. కానీ ప్రజల జేబుల్లోంచి డబ్బు మాత్రం బయటకు వెళ్తుంది. ఫైల్ కదలాలంటే డబ్బు. సర్టిఫికెట్ రావాలంటే డబ్బు. భూమి రికార్డు మారాలంటే డబ్బు. పర్మిషన్ రావాలంటే డబ్బు. కొన్ని సందర్భాల్లో కేసులో ఉపశమనం కోసం కూడా డబ్బు అడుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తాయి. డబ్బు.. డబ్బు.. డబ్బు..! ప్రజల పన్నులతో నడిచే వ్యవస్థే ప్రజల జేబుకు కన్నం వేస్తే దాన్ని కేవలం అవినీతి అని మాత్రమే పిలవాలా? లేక ప్రజలపై జరుగుతున్న దోపిడీగా చూడాలా? అవినీతి ఆరోపణల చర్చ వచ్చినప్పుడు తరచుగా రెవెన్యూ, పోలీసు, రిజిస్ట్రేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ వంటి శాఖల పేర్లు వినిపిస్తుంటాయి. పరుగు పందెంలో పోటీ పడుతున్నట్లుగా రెవెన్యూ వర్సెస్ పోలీస్ అనే చర్చ కూడా ప్రజల్లో కనిపిస్తోంది. భూమి, ఆస్తులు, రికార్డులు, పట్టాలు, మ్యుటేషన్లు, ధ్రువపత్రాలు వంటి అంశాలతో నేరుగా సంబంధం ఉండటం వల్ల రెవెన్యూ శాఖలోని నిర్ణయాలకు ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. మరోవైపు పోలీసు శాఖకు ఫిర్యాదులు, కేసులు, విచారణలు, చట్టపరమైన చర్యలు వంటి అంశాలతో ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.





