Bihar Boy Returns 8 Years : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఓ 12 ఏళ్ల బాలుడికి.. చెరువు గట్టు వద్ద పాము కరిచింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేయించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. బాబు చనిపోయాడని వైద్యులు చెప్పగా.. చేసేదేమీ లేక అతడిని తీసుకొచ్చి గంగానదిలో వదిలేశారు. విపరీతంగా ఏడుస్తూనే.. తమకు, కుమారుడికి బంధం తెగిపోయిందని భావించారు. కానీ సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత సదరు బాలుడు తిరిగి ఇంటికి వచ్చాడు. చనిపోయిన వాడు ఇంటికొచ్చి నేనే మీ కొడుకును, కావాలంటే ఈ గాయాలు చూడమంటూ చెప్పగా.. తీవ్రంగా ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు అతడిని గుర్తించారు. తమ కుమారుడేనని తెలుసుకుని షాక్ అయ్యారు. అసలిదెలా సాధ్యమైందంటూ కొడుకును అడగ్గా.. ఆయన ఏం చెప్పారంటే?12 ఏళ్ల వయసులో ఊహించని విషాదం..ఈ ఘటన బిహార్‌లోని బెగూసరాయ్ జిల్లా మానోపూర్ ముషహరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామ్‌ప్రీత్ దాస్, కవిత దంపతులకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఎనిమిదేళ్ల క్రితం అంటే రాహుల్‌కు 12 ఏళ్ల వయసు ఉన్న సమయంలో.. అతడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని నది ఒడ్డుకు వెళ్లాడు. ఆ సమయంలో అనూహ్యంగా విషసర్పం కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. బాలుడికి వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మరణించాడని కుటుంబ సభ్యులు తీవ్రంగా కుమిలిపోయారు. విధిరాత ఇంతేనని భావించి.. సాంప్రదాయం ప్రకారం అయోధ్య ఘాట్ వద్ద బాలుడి శరీరాన్ని గంగానది ప్రవాహంలో విడిచి పెట్టి కన్నీళ్లతో ఇంటికి తిరిగివచ్చారు.సాధువుగా మారి ఇంటికి తిరిగొచ్చిన కుమారుడు..!అయితే నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న రాహుల్‌ను ఒక సాధువు చూసి కాపాడటంతో అతడికి పునర్జన్మ లభించింది. నది నుంచి ఒడ్డుకు చేర్చిన ఆ సాధువు.. బాలుడికి అవసరమైన చికిత్స అందించి తనతోపాటే వెంట తీసుకెళ్లాడు. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు తీసుకెళ్లి మరీ ఆధ్యాత్మిక విద్యను నేర్పించాడు. అక్కడే సాధువుల సమక్షంలో రాహుల్ ఇన్నాళ్లూ ఆధ్యాత్మిక సాధన చేస్తూ పెరిగి పెద్దవాడు అయ్యాడు. అయితే అప్పుడప్పుడూ తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గురించి గుర్తొచ్చి గురువుకు చెప్పేవాడు. అయితే విద్య అయ్యాక.. ముందుగా నీ తల్లి వద్దకే వెళ్లి భిక్ష తెచ్చుకోవాలని ఆయన చెప్పాడు. దీంతో తన చదువు అయిపోగానే.. అతడు వెంటనే తన సొంతింటికి బయలుదేరాడు.ఇదీ చూడండి: ప్రకాశం జిల్లా: చనిపోయాడని పెద్ద కర్మ చేస్తుంటే ఇంటికి తిరిగొచ్చాడు.. ఏమైందంటే!అందరి పేర్లు చెప్పి మరీ గుర్తు పట్టిన రాహుల్..సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తి కాగానే రాహుల్ తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నాడు. గ్రామానికి వచ్చిన అతడు తన తల్లితో పాటు ఊరిలోని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడంతో గ్రామస్థులంతా ఆశ్చర్యపోయారు. చిన్నతనంలో శరీరంపై ఉన్న పాత గాయాన్ని చూసి అతడు తమ సొంత కుమారుడేనని తల్లిదండ్రులు కచ్చితంగా గుర్తించి కంటినీరు పెట్టుకున్నారు. చనిపోయిన నువ్వు ఎలా బతికొచ్చావని అడగ్గా... ఓ సాధువే తనను కాపాడి పెద్దవాడిని చేశాడని వివరించాడు. అంతేకాకుండా ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్పించాడని చెప్పగా.. ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఊరు వాళ్లంతా హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇంటికొచ్చిన రాహుల్ ఒక రోజు కాగానే మళ్లీ యూపీ వెళ్లిపోయాడు. వెళ్తానని చెప్పగానే తల్లిదండ్రులు ఆయనకు ఓ ఫోన్ కొనిచ్చి.. పూర్తిగా ఇంటికి తిరిగొచ్చేయాలని వివరించారు.ఇదీ చూడండి: సాయంత్రమే అంత్యక్రియలు.. రాత్రికి ఇంటికి తిరిగొచ్చాడు.. అంతా షాక్!కానీ అలా రావాలంటే రూ.2 లక్షలు ఖర్చు చేసి.. తానుంటున్న చోట అన్నదానం చేయాలని చెప్పాడు రాహుల్. దీంతో రాహుల్ బాబాయ్‌కి అతడి మీద అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.