
చినగంజాం: చినగంజాం మండలంలోని సోపిరాల గ్రామంలో ఆర్అండ్బీ రహదారి పక్కన వినాయక విగ్రహాల తయారీ పందిరి (కేంద్రం) ఉంది. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత రెండు దశాబ్దాల కాలం నుంచి సోపిరాలలో స్థలాన్ని అద్దెకు తీసుకొని వినాయక చవితి పండుగకు సుమారు వంద వినాయక విగ్రహాలను తయారు చేసేవారు. అయిదారు అడుగుల ఎత్తు నుంచి భారీ ఎత్తుగా ఉండే విగ్రహాలను తయారు చేసి అమ్మేవారు. కొన్నాళ్ల కిందట వ్యాపారి భార్య చనిపోవడంతో పిల్లలతో కలిసి ఉన్న వ్యాపారి కొన్ని నెలల నుంచి కన్పించలేదు. పిల్లలతో సహా సొంతూరు వెళ్లిన అతను ఇప్పటి వరకు తిరిగి రాలేదు. పందిరికి కవర్లు కప్పి ఉన్నాయి. వినాయక విగ్రహాలు ఉండిపోయాయి. గత సంవత్సరం తయారు చేసిన ఒక్కో భారీ విగ్రహానికి రూ.70 వేలు చెప్పడంతో కొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో భారీ విగ్రహాలతోపాటు సుమారు రూ.5 లక్షలు విలువ చేసే విగ్రహాలు ఉండిపోయాయి.
గత సంవత్సరం విగ్రహాలు తయారీకి స్థానికంగా పులువురి దగ్గర వ్యాపారి సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు చేశారు. వాటిని తీర్చకుండా తయారు చేసిన విగ్రహాలను వదిలి పెట్టి వెళ్లిపోయాడు. ఈ నెల 14న వినాయక చవితి పండుగ. దీంతో పెద్ద విగ్రహాలను కొని అడ్వాన్సులు ఇచ్చేందుకు చాలా మంది ఇక్కడికి వచ్చి నిరుత్సాహంగా తిరిగి వెళుతున్నారు. దీంతో నిరుడు సందడిగా కనిపించిన పందిరి.. ఇప్పుడు మూతపడింది. దూర ప్రాంతాలకు వెళ్లి పెద్ద విగ్రహాలను తెచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నామని పలు గ్రామాలకు చెందిన యువకులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





