
Balochistan Must Possess 4 Specific Elements Of Montevideo Convention To Become A Sovereign State
పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్థాన్ . ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడంతో బలూచ్ ప్రజల్లో ఎప్పటి నుంచో స్వతంత్ర ఆకాంక్ష ఉన్న సంగతి తెలిసిందే.
పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్థాన్ . ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడంతో బలూచ్ ప్రజల్లో ఎప్పటి నుంచో స్వతంత్ర ఆకాంక్ష ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బలూచిస్థాన్ వేర్పాటువాదులు తమ ప్రాంతాన్ని ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్’ పేరిట స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఆగస్టు 11న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుతామని ప్రకటించారు.బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా మారడానికి ఏమేం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది? ఈ విషయంలో బలూచ్‌కు ఏ మేరకు భారత్ సాయం చేయగలదు. ఇప్పటి వరకూ బలూచిస్థాన్ విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించడానికి కారణాలేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.ఏ ప్రాంతమైనా సరే స్వతంత్ర దేశంగా అవతరించడానికి మోంటెవీడియో కన్వెన్షన్‌లోని నాలుగు కీలక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 1933 డిసెంబర్ 26న ఉరుగ్వే రాజధాని మోంటివీడియోలో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందమే ఈ మోంటివీడియో తీర్మానం.మోంటివీడియో కన్వెన్షన్.. 4 నిబంధనలు..ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 1 ప్రకారం ఓ ప్రాంతాన్ని దేశం లేదా రాజ్యంగా గుర్తించడానికి నాలుగు అంశాలు కీలకం. అందులో ఒకటి శాశ్వత జనాభా. స్వతంత్ర దేశంగా అవతరించాలని భావిస్తున్న ప్రాంతంలో ప్రజలు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నివాసం ఉండాలి.రెండోది.. ఆ ప్రాంతానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఉండాలి. మూడోది ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి, చట్టాలను అమలు చేయడానికి ఒక ప్రభుత్వం ఉండాలి. నాలుగోది.. ఆ ప్రభుత్వానికి ఇతర దేశాలతో దౌత్య పరమైన, వాణిజ్య, చట్టపరమైన ఒప్పందాలు ఒప్పందాలు చేసుకునే అధికారం ఉండాలి.ఒక ప్రాంతానికి ఈ నాలుగు లక్షణాలు ఉంటే గనుక.. మోంటివీడియో కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 3 ప్రకారం ఇతర దేశాలు దాన్ని గుర్తించినా, గుర్తించకపోయినా సరే, దాని విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆ ప్రాంతానికి దేశంగా ఉండే అర్హత లభిస్తుంది.బలూచిస్థాన్ విషయానికి వస్తే.. ఈ ప్రాంతంలో ప్రజలు శాశ్వత నివాసం ఉంటున్నారు. ఇది ప్రస్తుతం పాకిస్థాన్ నియంత్రణలో ఉన్నప్పటికీ, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంగా గుర్తించే వీలుంది. బలూచిస్థాన్ వేర్పాటువాద నాయకులు తమ భూభాగంపై సార్వభౌమాధికారం సాధిస్తేనే ఇది సాధ్యం అవుతుంది.ఆ తర్వాత అంతర్జాతీయ నిబంధనల ప్రకారం బలూచిస్థాన్ ప్రజలు రెఫరెండం ద్వారా తాము పాకిస్థాన్‌లో ఉండాలని కోరుకోవడం లేదని నిరూపించాలి. దీనికోసం ముందుగా బలూచిస్థాన్ ప్రజలను పరిపాలించడానికి ప్రభుత్వం ఏర్పాటు కావాలి. ఆ తర్వాత ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలి.నాలుగో నిబంధనకు భారత్ సాయం చేయగలదు కానీ..!బలూచిస్థాన్ గనుక మోంటివీడియో కన్వెన్షన్‌లోని మొదటి మూడు నిబంధనలను సాధిస్తే.. నాలుగో నిబంధనను సాధించడంలో భారత్ సహాయపడే అవకాశం ఉంటుంది. అధికారికంగా స్వతంత్ర దేశంగా గుర్తించడంతోపాటు.. మన దేశంలో బలూచిస్థాన్ రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అనుమతించడం, క్వెట్టాలో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడం లాంటి పనులు చేయగలదు. ఆ దేశంతో ద్వైపాక్షిక, వాణిజ్య, భద్రతా ఒప్పందాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. అయితే భారత్ అలా చేయాలంటే మోంటివీడియో కన్వెన్షన్‌లోని మూడు నిబంధనలను బలూచిస్థాన్ పాటించాల్సి ఉంటుంది. అయితే బలూచిస్థాన్‌ను భారత్ ప్రత్యేక దేశంగా గుర్తిస్తే.. పాకిస్థాన్‌తో యుద్ధానికి దిగే అవకాశం ఉంది. బలూచిస్థాన్‌లో చైనా భారీ పెట్టుబడులు పెట్టింది. కాబట్టి ఆ దేశంతోనూ ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. నలుదిక్కులా సమ్యసలతో పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతోన్న సంగతి తెలిసిందే.ఇండియావైపు ఆశగా..బలూచిస్థాన్ ప్రత్యేక దేశంగా మారే క్రమంలో అక్కడి ప్రజలు సాయం కోసం భారత్ వైపు ఆశగా చూస్తున్నారు. అయితే బలూచిస్థాన్‌కు నేరుగా సాయం చేసే విషయంలో భారత్‌కు అనేక పరిమితులు ఉన్నాయి. పాకిస్థాన్‌లో భాగంగా ఉన్న బలూచిస్థాన్‌ను విడదీసి ప్రత్యేక దేశంగా గుర్తిస్తే ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. బలూచిస్థాన్‌కు భారత్‌కు భౌగోళికంగా సరిహద్దు లేదు కాబట్టి.. బలూచ్‌లకు భారత్ సాయం అందించడం కష్టం అవుతుంది. అంతర్జాతీయంగానూ అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్‌పై ఒత్తిడి తెస్తాయి.భారత్ ఎలా సాయం చేయగలదు?అయితే బలూచిస్థాన్ ప్రజలకు మద్దతుగా భారత్ ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై గళం విప్పగలదు. బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం జరుపుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ సమాజానికి చూపెట్టగలదు. బలూచ్ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన కథనాలను మీడియా ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లగలదు. విదేశాల్లో ఆశ్రయం పొందుతున్న బలూచ్ నాయకులకు ఆశ్రయం కల్పించగలదు.ఐక్యరాజ్య సమితి గుర్తించాలంటే..?ఐక్యరాజ్య సమితి బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించడం, దానికి సభ్యత్వం కల్పించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని కొత్త దేశంగా గుర్తించడానికి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ ఆమోదం తెలపాలి. ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఒక దేశం వీటో చేసినా సరే ఆ ప్రాంతాన్ని ఐక్యరాజ్య సమితి కొత్త దేశంగా గుర్తించడం కుదరదు. ఆ తర్వాత జనరల్ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించాలి. అప్పుడే దానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు, సభ్యత్వం లభిస్తుంది.






