
ప్రేక్షకులు ఒక పాత్రలోనే గుర్తుపెట్టుకున్నా.. ఒక యాక్టర్గా అక్కడే ఆగిపోకూడదు అనుకుంటారు ఆర్టిస్ట్లు. నటి ఆశా నేగి (Asha Negi) కూడా అలాంటి ఆర్టిస్టే. ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్లో పుర్విగా ఇంటింటికీ చేరిన ఆమె.. ఆ తర్వాత టీవీని వదిలి వెబ్‌ సిరీస్‌ల వైపు అడుగులు వేసింది. చిన్న పాత్ర అయినా నటనకు అవకాశం ఉంటే చాలు అనే ఆలోచనతో ముందుకు సాగుతోంది. తాజాగా ‘క్రిమినల్ జస్టిస్‌ 4’లో రోష్ని సలూజాగా కనిపించి మరోసారి తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇప్పుడు ‘అలీబాబా ఔర్ 40 భూత్’ అనే సిరీస్లో అలీషా నిగమ్ పాత్రలో నటించింది.
A post shared by Asha Negi (@ashanegi)
ఉత్తరాఖండ్‌‌లోని డెహ్రాడూన్‌‌కి చెందిన ఆశా నేగికి చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి పెరిగింది. అయితే వెంటనే సినిమా రంగంలోకి రాలేదు. బెంగళూరులో టూర్స్‌‌ అండ్‌‌ ట్రావెల్స్‌‌ సంస్థలో ఉద్యోగం చేసింది. కానీ మనసంతా నటన వైపే ఉండటంతో ఆ ఉద్యోగం ఎక్కువకాలం కొనసాగించలేకపోయింది. ముంబై వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయం తీసుకుంది.
కొత్త నగరం.. కొత్త ప్రపంచం.. చేతిలో పెద్దగా అవకాశాలు లేని పరిస్థితి. అయినా వెనక్కి తగ్గలేదు. మోడలింగ్‌‌తో కెరీర్‌‌ మొదలుపెట్టి 2009లో ‘మిస్‌‌ ఉత్తరాఖండ్‌‌’ టైటిల్‌‌ గెలుచుకుంది. ఆ గుర్తింపు ఆమెకు టెలివిజన్‌‌ అవకాశాలకు దారి తీసింది. 2010లో ‘సప్నో సే భరే నైనా’ సీరియల్‌‌తో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ‘బడే అచ్చే లగ్తే హై’ వంటి సీరియల్స్లో కనిపించింది. అయితే ఆమె కెరీర్‌‌కు నిజమైన మలుపు మాత్రం ‘పవిత్ర రిష్తా’తో వచ్చింది.
‘పవిత్ర రిష్తా’లో పుర్వి దేశ్‌‌ముఖ్‌‌ పాత్ర ఆశా నేగికి భారీ గుర్తింపు తెచ్చింది. సీరియల్‌‌ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ఆ పాత్రలో అమాయకత్వం, భావోద్వేగం, కుటుంబంపై ప్రేమను సహజంగా చూపించింది. రిత్విక్‌‌ ధంజానీతో ఆమె జోడీ కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌‌ సంపాదించింది. అలా ఒక్కసారిగా ఆశా పేరు టెలివిజన్‌‌ ప్రేక్షకులకు సుపరిచితమైంది. అయితే ఇక్కడే ఆమె మరో నిర్ణయం తీసుకుంది. తనకు వచ్చిన విజయాన్ని పట్టుకుని అదే తరహా పాత్రల్లో కొనసాగడం కంటే.. కొత్తగా ఏదైనా చేయాలనుకుంది.
‘క్రిమినల్‌‌ జస్టిస్‌‌ 4’తో మరోసారి చర్చలో..
2025లో వచ్చిన ‘క్రిమినల్‌‌ జస్టిస్‌‌ 4’లో పంకజ్‌‌ త్రిపాఠి, జీషాన్‌‌ అయూబ్‌‌, శ్వేతా బసు ప్రసాద్‌‌ వంటి నటులతో కలిసి ఆశా నేగి నటించింది. ఇందులో ఆమె పాత్ర కథలో కీలకమైన మలుపుకు కారణమవుతుంది. ‘పవిత్ర రిష్తా’లో చూసిన ఆశాకు ఇది పూర్తిగా భిన్నమైన ప్రపంచం. ఈ పాత్ర తన ‘గర్ల్‌‌ నెక్స్ట్‌‌ డోర్‌‌’ ఇమేజ్‌‌ను దాటేందుకు కూడా ఉపయోగపడిందని ఆశ చెప్పింది. నటిగా ఎక్కువ కాలం గుర్తుండిపోవాలంటే మంచి కథలు, మంచి పాత్రలు ఎంచుకోవడమే ముఖ్యమని ఆమె భావిస్తోంది.
ఓటీటీతోపాటు సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఆశ. అనురాగ్‌‌ బసు దర్శకత్వం వహించిన ‘లూడో’తో బాలీవుడ్‌‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘కాలర్‌‌ బాంబ్‌‌’లోనూ కనిపించింది. ‘లూడో’ తనకు ప్రత్యేకమైన సినిమా అని ఆశ గతంలో చెప్పింది. అది థియేటర్లలో కాకుండా నెట్‌‌ఫ్లిక్స్‌‌లో విడుదలైనప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది.
A post shared by Asha Negi (@ashanegi)
ఆశా నేగి లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘అలీ బాబా ఔర్‌‌ 40 భూత్‌‌’. ప్రేక్షకులు తనను ‘పుర్వి’గా గుర్తుపెట్టుకున్నా.. ఆశా మాత్రం అక్కడే ఆగిపోలేదు. తనకు నచ్చిన పాత్ర కోసం వేచి చూసింది. కొత్త దారిని ఎంచుకుంది. ఇప్పుడు ఆమె లక్ష్యం తెరపై ఎక్కువసేపు కనిపించడం కాదు.. కనిపించినంతసేపూ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా నటించడం.
టెలివిజన్‌లో మంచి పేరు, ఆదాయం, అభిమానులు ఉన్న సమయంలోనే ఆశా నేగి కొత్త అవకాశాల కోసం వెతకడం మొదలుపెట్టింది. వరుసగా రెండు షోలు ఆగిపోవడం, తనకు నచ్చిన కథలు దొరకకపోవడం ఆమెను ఆలోచింపజేశాయి. కొంతకాలం అవకాశాల కోసం ఎదురుచూసినా, తనకు నచ్చని ప్రాజెక్టులను ఒప్పుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంది.
A post shared by JioHotstar (@jiohotstar)
రియాలిటీ షోలకు గుడ్‌బై..
ఆశా నేగి కేవలం సీరియల్స్కే పరిమితం కాలేదు. ‘నాచ్‌ బలియే 6’లో రిత్విక్‌ ధంజానీతో కలిసి పాల్గొని విజేతగా నిలిచింది. ‘ఖత్రోన్‌ కే ఖిలాడీ 6’లోనూ తన ధైర్యాన్ని చూపించింది. అయితే ఇప్పుడు మాత్రం వరుసగా రియాలిటీ షోలు చేయాలనే ఆలోచన లేదని స్పష్టం చేసింది. గతంలో కొన్ని రియాలిటీ షోలు చేసిన తర్వాత.. ప్రస్తుతం నటనపైనే ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపింది.
A post shared by Asha Negi (@ashanegi)






