ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతోంది.. దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ కారణంగా అదనంగా బస్సులు అవసరమయ్యాయి.. కేంద్రం సహకారంతో రాష్ట్రానికి విద్యుత్ బస్సులు విడతలవారీగా వస్తున్నాయి. కొత్త బస్సులతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ మరో వినూత్నమైన ఆలోచన చేసింది.. పాత బస్సుల్ని ఏసీ ఈవీ బస్సులుగా మారుస్తోంది. పాత సూపర్‌లగ్జరీ బస్సును పుణెకు చెందిన కల్యాణి పవర్ట్రైన్ లిమిటెడ్ సంస్థ తక్కువ ఖర్చుతో రెట్రీఫిట్మెంట్ ద్వారా గ్రీన్ ఇంద్ర ఏసీ విద్యుత్ బస్సుగా మార్చేశారు. ఈ బస్సును తిరుపతి నుంచి కాణిపాకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ విద్యుత్ బస్సు రెండు నెలల క్రితం విజయవాడ నుంచి తిరుపతికి తీసుకొచ్చారు. అనంతరం బస్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, రోడ్డు కన్వెర్షన్ సహా అవసరమైన అనుమతులు తీసుకున్నారు. జులై 24న ఈ బస్సును తిరుపతి నుంచి కాణిపాకం ట్రయల్ రన్ నిర్వహించారు.. ఆ తర్వాత బస్సును రెగ్యులర్ సర్వీసుగా ప్రారంభించాలని భావించారు. కానీ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది.. దీంతో ఆర్టీసీ అధికారులు ఈ బస్సు డిపోలో ఖాళీగా ఉంటుందని గమనించారు. ఇలా ఖాళీగా ఉంచే బదులు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే మంచిదని భావించారు.ఈ నెల 16న కాణిపాకానికి ఈ బస్సు రెండు ట్రిప్పులు నడిచింది.. ఆ సమయంలో కొన్ని లోపాలు గుర్తించారు. ఈ నెల 17న ఈ బస్సును గ్యారేజీకి తీసుకెళ్లి లోపాలను సరిచేశారు. ఈ విద్యుత్ బస్సు మంగళవారం రోజు తిరుపతి నుంచి కాణిపాకానికి 22మంది ప్రయాణికులతో బయలదేరి వెళ్లింది. అనంతరం కాణిపాక నుంచి చిత్తూరు వెళ్లి అక్కడ అవసరమైన కొన్ని తనిఖీలు చేసిన తర్వాత మళ్లీ 20మంది ప్రయాణికులతో తిరుపతి చేరుకుంది. మొత్తం మీద ఏపీఎస్ఆర్టీసీ చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది. గ్రీన్ ఇంద్ర ఏసీ బస్సు అందరిని ఆకట్టుకుంటోంది.పాత సూపర్ లగ్జరీ బస్సును విజయవాడలోని వర్క్‌షాప్‌కు తరలించి విద్యుత్ బస్సుకు అవసరమైన మార్పులు చేశారు. రూ.90 లక్షలతో గ్రీన్ ఇంద్ర బస్సుగా మార్చారు. విజయవాడలోనే అవసరమైనన అన్ని ట్రయల్ రన్స్ నిర్వహించారు. అనంతరం ఈ ఏడాది జూన్ నెలలో ఈ బస్సును విజయవాడ నుంచి తిరుపతికి పంపించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ బస్సు గంటన్నరలోనే ఛార్జ్ అవుతుంది.. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. పాత బస్సుల్ని అలా వదిలేయకుండా ఇలా విద్యుత్ బస్సులుగా మారిస్తే బావుంటుందనే ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద ఆర్టీసీ గ్రీన్ ఇంద్ర బస్సు అందుబాాటులోకి వచ్చింది.

