విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానుండటంతో ఆర్టీసీ కూడా రంగంలోకి దిగింది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ మొత్తం 20 ఎలక్ట్రికల్ బస్సుల్ని ఏరో ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో నడపనుండగా.. ఇప్పటికే 16 బస్సులకు ట్రయల్ రన్ పూర్తి చేశారు ఆర్టీసీ అధికారులు. ఈ ట్రయల్ రన్‌ను ఆర్టీసీలోని మెకానికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రిక్ విభాగం అధికారులు, బస్సు బిల్డింగ్ నిపుణులు పర్యవేక్షించారు. ఈ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఫుల్‌గా ఛార్జింగ్ పెట్టి ఎన్ని కిలోమీటర్ల వరకు (మైలేజ్) నడుస్తున్నాయో పరిశీలించారు.ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం భోగాపురం ఎయిర్‌పోర్టు, గాజువాక డిపో, ద్వారకా బస్స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, విమానాలు దిగి విశాఖపట్నానికి వచ్చేవారి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సుల్ని సిద్ధం చేశారు. అంతేకాదు ఈ బస్సులు నడిపే డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. ఈ మేరకు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం.. ఆర్టీసీ రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి 50 మంది డ్రైవర్లతో పాటుగా ఎక్కువ విద్యార్హత ఉన్న కండక్టర్లను ఎంపిక చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.ఆర్టీసీ ప్రధానంగా ఈ బస్సుల్లోని సిబ్బంది ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరు, మాట్లాడాల్సిన విధానం, బాడీ లాంగ్వేజీపై కూడా శిక్షణ ఇచ్చామంటున్నారు. అంతేకాదు ఈ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సిబ్బందికి ప్రత్యేక డ్రస్ కోడ్ అమలు చేస్తాము అంటున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ 16 బస్సులు అందుబాటులోకి వస్తాయంటున్నారు. మరో నాలుగు బస్సులు ఒకటి, రెండు రోజుల్లో వస్తాయని.. వాటి రిజిస్ట్రేషన్, ట్రయల్‌రన్ పూర్తయ్యాక వాటిని కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు.ఈ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోసీసీ కెమెరాలతో పాటుగా 12 మీటర్ల వెడల్పుతో 40 మంది ప్రయాణికులకు సరిపడేలా సిటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 200 కి.మీ వరకు నడుస్తాయి. ఈ బస్సుల్లో విశాఖపట్నం నుంచి భోగాపురానికి ఛార్జీలపై ఆర్టీసీ అధికారులు ఫోకస్ పెట్టారు. గాజువాక నుంచి భోగాపురానికి ఛార్జీ దాదాపు రూ.400 వరకు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అదే ద్వారకా బస్టాండ్, నగరంలో ఇతర స్టాపుల నుంచి అయితే రూ.300 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం 20 బస్సులు రెండు వైపులా రాకపోకలు సాగిస్తాయంటున్నారు. ప్రతి రోజూ తెల్లవారుజాము 4.30 గంటలకు తొలి సర్వీసు ప్రారంభమై.. రాత్రి 10.30 గంటలతో చివరి సర్వీసు ముగిసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విమాన సర్వీసుల్ని బట్టి ఈ సమయాల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశాల ఉన్నాయి. ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.





