
Amalapuram: అమలాపురం కలెక్టరేట్లో ఘనంగా గౌతు లచ్చన్న జయంతి!
Amalapuram: అణగారిన, బడుగు వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయమని ఏపీ శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు బొంతు గంగాధర్ రావు అన్నారు.
జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం అమలాపురం కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో బొంతు గంగాధర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమంలో గౌతు లచ్చన్న కీలక పాత్ర పోషించారని, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
జిల్లా పరిపాలన అధికారి నాగలక్ష్మమ్మ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం గౌతు లచ్చన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సమాజ అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పి. భగవాన్, రామచంద్రాపురం బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ కేఎన్ దొర, శెట్టిబలిజ సంఘం సభ్యులు కడలి వెంకటేశ్వరరావు, గొల్లపల్లి ధర్మారావు, కట్ట జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.




