Yash Baxi World Record 2026 : ఏ చిన్న లెక్క చేయాలన్నా ఇప్పడందరూ ఫోన్లోనే కాలుక్యులేటర్ ఓపెన్ చేసి లెక్కించేస్తారు. లేదంటే ఏఐ, గూగుల్ సాయంతో తమకు కావాల్సిన విషయాలను తెలుసుకుంటారు. కానీ మనసులోనే 120 దేశాల్లో ఎక్కడెంత టైమ్ అవుతుందని కేవలం 5 నిమిషాల్లోనే చెప్పి ప్రపంచ రికార్డు సాధించాడు అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువకుడు. 21 ఏళ్ల వయసు కల్గిన యశ్ హేమాంగ్ బక్షి ఈ రికార్డును సాధించగా.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎలాంటి డివైజ్‌లు, చార్టులు, కనీసం కాగితం సహాయం లేకుండా కేవలం తన మెదడు శక్తితోనే 120 దేశాల స్థానిక సమయాన్ని 5.14 నిమిషాల వ్యవధిలోనే లెక్కించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. ప్రపంచంలోని వివిధ కాలమానాలు, అర్ధగంట, 45 నిమిషాల తేడాల వ్యత్యాసాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో గణించి అందరినీ ముగ్ధులను చేశాడు.పాత రికార్డును తిరగరాసిన యష్ బక్షి..!గతంలో భారత ప్రమాణ సమయం ఆధారంగా 101 దేశాల స్థానిక సమయాన్ని 14 నిమిషాల 42 సెకన్లలో లెక్కించి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్', 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లలో యశ్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఈసారి తన స్వంత రికార్డునే తిరగరాస్తూ.. ఏకంగా 120 దేశాల సమయాన్ని కేవలం 5.14 నిమిషాల్లోనే చెప్పి సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడు. 'వరల్డ్ రికార్డ్ యూనియన్' ప్రతినిధి షరీఫా హనీఫా ఈ ఘనతను స్వయంగా పరిశీలించి అధికారికంగా ప్రపంచ రికార్డుగా ప్రకటించారు.ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు.. అబ్బురపరుస్తోన్న హైదరాబాదీ ఫ్యామిలీయశ్ సాధించిన ఈ అరుదైన మైలురాయి వెనుక ఆయన గురువు కమలేష్ సుర్తి ఎంతో శ్రమించారు. గత కొన్నేళ్లుగా యశ్‌కు శిక్షణ ఇస్తున్న కమలేష్ సుర్తి.. బట్టీ పట్టే విధానం కాకుండా విద్యార్థులలోని సహజ ప్రతిభను గుర్తించి దానికి తగిన శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ధులు. "యశ్ కేవలం వేగంగా లెక్కించడమే కాకుండా సుదీర్ఘకాలం పాటు ఒకే లక్ష్యంపై తీవ్రమైన దృష్టి నిలుపుతాడు. ప్రతిభకు తోడు క్రమశిక్షణ, పట్టుదల తోడైతే ప్రపంచ రికార్డులు సాధ్యమవుతాయని అతడు నిరూపించాడు" అని సుర్తి కొనియాడారు.ఇదీ చూడండి: 9 అడుగుల పొడవాటి జుట్టు పెంచి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన ఉత్తరాఖండ్ మహిళ!యువతకు కీలక సందేశం..!ఈ చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం యశ్ బక్షి మాట్లాడుతూ.. "ముందుగా నాకు ఈ శక్తిని అనుగ్రహించిన దేవునికి, ప్రతి అడుగులో తోడుగా నిలిచిన నా తల్లిదండ్రులకు, నాలోని ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దిన నా గురువు కమలేష్ సుర్తి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరానికి నేను చెప్పేది ఒకటే.. 'గ్యాడ్జెట్లను మనం ఉపయోగించాలి కానీ.. అవి మనల్ని ఉపయోగించుకునేలా మారకూడదు'. సాంకేతికత మంచి సాధనమే కానీ దానికి బానిసలు కాకూడదు. సరైన శిక్షణ, ఏకాగ్రత ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా భర్తీ చేయలేని అద్భుతాలను మానవ మెదడు సాధించగలదు" అని పిలుపునిచ్చాడు. తన కుమారుడి విజయంపై తల్లి డాక్టర్ సంగీతా బక్షి ఆనందం వ్యక్తం చేస్తూ.. దేవునిపై నమ్మకం, నమ్రత కలిగి ఉండటమే యశ్‌ను ఈ స్థాయిలో నిలబెట్టాయని పేర్కొన్నారు. ఈ ఘనతతో గుజరాత్ ప్రతిభను అంతర్జాతీయ వేదికపై యశ్ మరోసారి సగర్వంగా నిలబెట్టాడు.



