
కాకినాడ: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీకల పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదుతో సాధిక్‌ఖాన్‌పై మరో కేసు నమోదైంది. జులై 2న తన కుమారుడు జగదీశ్‌రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాధిక్ హత్య చేశాడని భాస్కర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్య కేసులో సాధిక్తో పాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. సాధిక్ కారణంగానే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఇప్పటికే కేసు నమోదైంది. నిన్న మనవడు కార్తికేయరెడ్డితో మాట్లాడగా విషయం తెలిసిందని భాస్కర్‌రెడ్డి పోలీసులకు తెలిపారు. నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో మూడు కవర్లను పోలీసులు గుర్తించారు. జగదీశ్‌రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘సాధిక్ ఖాన్ నన్ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేశాడు. నా భర్తను సాధిక్ హత్య చేశాడు. నా ఆస్తి, ఫోన్, ఎస్బీఐ లాకర్ వివరాలు తీసుకున్నాడు. మతం మారాలని ఒత్తిడి చేశాడు. నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు. సాధిక్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాం’’ అని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు సాధిక్‌ఖాన్ కోసం ఇప్పటికే గాలిస్తున్నారు. మరోవైపు.. నిన్న గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఈ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం ఎస్డీఎఆర్ఎఫ్ బృందం, పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు కొనసాగిస్తున్నారు.
కాకినాడ అశోకనగర్లో నివాసముంటున్న తిల్లపూడి నూకరాజు (61) పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా గత పదేళ్లుగా విధులు నిర్వరిస్తున్నారు. వచ్చే జనవరిలో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సిఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా (58), కుమార్తె కోవూరి సౌజన్య (38), మనుమడు రియాన్ష్ కార్తికేయరెడ్డి(10)తో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రోడ్డు కం రైలు వంతెనపై కారు నిలిపి నలుగురూ గోదావరిలో దూకేశారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెంటనే సమీప లంకల్లోని మత్స్యకారులను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈత వచ్చిన కార్తికేయ దాదాపు 20 నిమిషాల పాటు గోదావరిలో ఈదుతూ హెల్ప్‌హెల్ప్ అని అరిచాడు. మత్స్యకారులు బాలుణ్ని గమనించి వెంటనే పడవలో ఒడ్డుకు చేర్చారు. కాలు, నడుంపై స్వల్పగాయాలైన కార్తికేయకు పోలీసులు ఓ ఆసుపత్రిలో చికిత్స అందించి, బంధువులకు అప్పగించారు. మిగతావారి కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది, గజ ఈతగాళ్లు ప్రత్యేక బోట్లతో గోదావరిలో గాలింపు చేపట్టారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు నూకరాజు మృతదేహం రాజమహేంద్రవరంలోని దోబీఘాట్ వద్ద లభించింది.
కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాధిక్‌ఖాన్ వేధింపులు, హింస భరించలేక తామంతా చనిపోవాలని నిర్ణయించుకున్నామని నూకరాజు లేఖ రాశారు. ‘నా అల్లుడు జులై 2న మరణించాడు. ఆ తరువాత నా కుమార్తెకు సహాయంగా ఉంటానని సాధిక్ ప్రతిపాదించాడు. మేం అంగీకరించలేదు. ఐదో తరగతి చదువుతున్న నా మనవణ్ని, నన్ను చంపుతానని మా అమ్మాయిని బెదిరించి విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలు అతని అధీనంలోకి తీసుకున్నాడు. పరువుగా బతికిన మా అమ్మాయిని చాలా హింసిస్తున్నాడు. మేం ఏమైనా చెబితే చంపుతానంటున్నాడు. ఇదంతా తట్టుకోలేక నేను, నా భార్య, కుమార్తె, మనవడితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా. ఆ దుర్మార్గుణ్ని కఠినంగా శిక్షించాలి’ అని కలెక్టర్, ఎస్పీలను కోరుతూ రాసిన లేఖను ఆయన వాట్సప్‌లో సహోద్యోగులు, మరికొందరికి పంపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





