
టాటా సన్స్ కు చంద్రశేఖరన్ గుడ్ బై
ఇంటర్నెట్‌డెస్క్: టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి ఎన్. చంద్రశేఖరన్ వైదొలిగారు (N Chandrasekaran). ఆగస్టు 18న కంపెనీ వార్షిక సర్వ సభ్యసమావేశం జరగనుంది. దానికిముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా నియమితులైన చంద్రశేఖరన్ రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2027 ఫిబ్రవరితో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే.. ఆ తర్వాత తన పునర్నియామకం ఉండబోదని.. గడువు పూర్తయ్యే వరకు కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ‘‘టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్నాను. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థకు సేవలందించినందుకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. దశాబ్దకాలంగా టాటా సన్స్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా, బాధ్యతగా భావించాను’’ అని చంద్రశేఖరన్ (Tata Sons Chairman N Chandrasekaran) తన ప్రకటనలో పేర్కొన్నారు . 2027 తర్వాత తన పునర్నియామకానికి బోర్డు సభ్యుల్లో ఒకరు మద్దతు ఇవ్వలేదని వెల్లడించారు. ఏకగ్రీవ మద్దతు లేకపోవడంతో తాను ముందుకు సాగాలని అనుకోవడం లేదని చెప్పారు. ‘‘టాటా సన్స్ (Tata Sons) చాలా పెద్ద సంస్థ. ఎన్నో కీలక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నాయి. 2027 ఫిబ్రవరి తర్వాత గ్రూప్‌ను నడిపించడానికి ఒక నాయకుడు ఉండటం అవసరం. అదే సమయంలో ఉద్యోగులు, పెట్టుబడిదారులు, భాగస్వాములు, ఇతర వాటాదారులకు నాయకత్వంపై స్పష్టత ఇవ్వడం కూడా అంతే ముఖ్యం’’ అని పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ పునర్నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చంద్రశేఖరన్ పునర్నియామకానికి టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. టాటా గ్రూపులో కొన్ని కంపెనీలకు నష్టాలు వస్తున్న అంశాన్ని కూడా సమావేశంలో నోయల్ లేవనెత్తినట్లు తెలిసింది. అయితే.. ఏ కొత్త వ్యాపారమైనా లాభాల్లోకి రావాలంటే కొంత కాలం వేచిచూడాల్సి ఉంటుందని చంద్రశేఖరన్ పునర్నియామకానికి మద్దతిస్తున్న బోర్డు సభ్యులు నాడు పేర్కొన్నట్లు సమాచారం. 1987లో చంద్రశేఖరన్ టాటా గ్రూప్ (Tata Group) లో చేరారు