
కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: కాఫీ చాలా మందికి రోజూ తీసుకునే పానీయంగా మారిపోయింది. అయితే కాఫీ తాగే అలవాటుకు శరీరంలోని కొవ్వు, కండరాల పరిమాణానికి మధ్య సంబంధం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఎక్కువగా కాఫీ తాగే వ్యక్తుల్లో మొత్తం శరీర కొవ్వుతో పాటు పొట్టలోని అంతర్గత కొవ్వు తక్కువగా ఉండగా, కండరాల పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫిన్లాండ్లోని ఓలు విశ్వవిద్యాలయ పరిశోధకులు 1966 నార్తర్న్ ఫిన్లాండ్ బర్త్ కోహోర్ట్కు చెందిన 46 ఏళ్ల వయసున్న 2,264 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. వారి కాఫీ వినియోగం, శరీర కొవ్వు, కండరాల పరిమాణం తదితర అంశాలను పోల్చి ఈ విషయాలను గుర్తించారు. ఎక్కువగా కాఫీ తాగే వారిలో శరీర నిర్మాణానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించాయి. ముఖ్యంగా.. మొత్తం శరీర కొవ్వు పరిమాణం తక్కువగా ఉంది. అంతర్గత అవయవాల చుట్టూ పేరుకునే విసెరల్ ఫ్యాట్ తక్కువగా ఉంది. రక్తంలో కొన్ని బ్రాంచ్డ్-చైన్ అమైనో ఆమ్లాలు (BCAAలు) తక్కువగా ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎక్కువ, తక్కువ కాఫీ తాగే వర్గాల మధ్య BMIలో పెద్దగా తేడా కనిపించలేదు. BMI అంటే ఎత్తు, బరువు ఆధారంగా శరీర బరువు స్థితిని అంచనా వేసే కొలమానం. అయితే శరీరంలో కొవ్వు ఎంత ఉంది, కండరాలు ఎంత ఉన్నాయి అనే విషయాన్ని BMI ఖచ్చితంగా చెప్పదు. అందువల్ల ఒకే BMI ఉన్న ఇద్దరి శరీరాల్లో కొవ్వు, కండరాల పరిమాణం వేర్వేరుగా ఉండొచ్చు. కాఫీలో ఉండే కెఫిన్ నాడీ వ్యవస్థపై, అలాగే శరీరం శక్తిని వినియోగించే విధానంపై ప్రభావం చూపుతుంది. కెఫిన్ వల్ల శరీరంలో శక్తి ఖర్చు కొంత పెరగడం, ఆకలిలో మార్పులు రావడం, జీవక్రియపై ప్రభావం పడటం వంటివి జరగొచ్చని గతంలో జరిగిన పరిశోధనలు సూచించాయి. తాజా అధ్యయనం