సినీ నటి త్రిష కృష్ణన్ పై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారనే ఆరోపణలతో ఇటీవల నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ను తమిళనాడులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టయిన రోజే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. దీనిపై హీరో విశాల్ స్పందిస్తూ.. ఎంతోమంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో సీనియర్ నటీనటుల గురించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం విజయ్‌కు విశాల్ ఓ విజ్ఞప్తి చేశారు.గత కొన్ని రోజులుగా ‘మకుటం’ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాలు, రాజకీయ నాయకులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నటుడు సీమాన్ పాలిటిక్స్ లో నిజాయితీగా తనవంతు పాత్ర పోషిస్తున్నారని, ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను చేయాలనుకుంటున్న మంచి పనుల గురించి చెబుతూ ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, కానీ అది రిజల్ట్స్ లో కనిపించడం లేదన్నారు.ఉదయనిధి స్టాలిన్ గురించి విశాల్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఉదయ్ అంటే చాలా ఇష్టం. ఉదయ్, ఆయన భార్య కృతికతో మంచి సాన్నిహిత్యం ఉంది. అది ఎప్పటికీ మారదు. ఏం జరిగినా మా స్నేహం కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చినా.. నాకు, ఉదయ్ మధ్య ఎలాంటి విభేదాలు, గొడవలు రావు. మేం ఒకరినొకరం తిట్టుకోము. నేను ఈరోజు పబ్లిక్ గా చెప్తున్నాను. గతంలో ఒక సినిమా విషయంలో నేను అనుభవించిన బాధ వల్ల, అతడి ప్రొడక్షన్ హౌస్ గురించి కోపంగా మాట్లాడాను. అంతే తప్ప ఉదయ్ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అతను చాలా చాలా మంచి వ్యక్తి’’ అని అన్నారు.త్రిషపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్, ఆయన అరెస్ట్‌పై విశాల్ కూడా మాట్లాడారు. “నా స్నేహితుడు ఉదయ్ ఏదో అన్నాడు.. అరెస్ట్ అయి బెయిల్ మీద వచ్చాడు. అదే విధంగా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటీనటుల గురించి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. మరి ఆ యూట్యూబర్ల సంగతేంటి?. యూట్యూబ్ లో ఇష్టమొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. సీఎం జోసెఫ్ విజయ్‌కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండస్ట్రీకి చెందిన వారి గురించి యూట్యూబ్‌లో చాలా మంది నీచంగా మాట్లాడుతున్నారు. వాళ్లందరికి కూడా శిక్షపడేలా చేయాలని కోరుతున్నా’’ అని విశాల్ చెప్పుకొచ్చారు.ఇటీవల 'మకుటం' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనూ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ పై విశాల్ రియాక్ట్ అయ్యారు. రాజకీయ నాయకులు బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, హద్దులు దాటితే ఊహించని వివాదాలు, ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందనేది నిజమే అయినప్పటికీ, కొన్ని సున్నితమైన అంశాలలో హద్దులు దాటకుండా ఉండటం చాలా ముఖ్యమని హితవు పలికారు.రాజకీయ నాయకులు ప్రసంగాలు ఇచ్చే ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడటం ఎంతో శ్రేయస్కరమని విశాల్ సూచించారు. అలా కాకుండా మైకు ముందుకు వచ్చి ఆవేశంలో మాట్లాడే క్రమంలోనే పొరపాట్లు దొర్లుతాయని వ్యాఖ్యానించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో తనతో పాటు చదువుకున్న తన సీనియర్ విజయ్, తన బ్యాచ్‌మేట్ ఉదయనిధి స్టాలిన్.. ఇద్దరూ ఇలా రాజకీయ రణరంగంలో ఊహించని రీతిలో తలపడతారని, ఒకరి హయాంలో మరొకరు అరెస్ట్ అవుతారని తాను కలలో కూడా ఊహించలేదని విశాల్ అన్నారు. ప్రస్తుతం విజయ్ కూడా పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్నారని, పాలిటిక్స్ లో ఇవన్నీ సహజమేనని, ఇదే అసలైన రాజకీయం అని విశాల్ పేర్కొన్నారు.





