
Home » Devotional » Vinayaka Vratha Katha The Story Behind Ganesh Vratham
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు.
(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి)
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి ‘‘అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది’’ అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.
‘‘ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి- తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు- నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతో గాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి.
అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధార్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.
కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శ్యమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.
పూర్వకాలమున గజముఖుడయిన గజాసురుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, ‘స్వామీ నీవు నాయుదరమందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియందుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాదిదేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు.
మహావిష్ణువు తానును చిరు గంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు నాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై ‘‘ఏమి కావాలో కోరుకోండి.... ఇస్తాను’’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి ‘‘ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది, శివుడ్ని అప్పగించు’’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి ‘‘స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి,
నా చర్మము నీవు ధరించు’’ అని ప్రార్థించాడు. తన గర్భంలో వున్న శివుడిని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. ‘దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు, ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లు అవుతుంద’ని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది.
శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి, లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులనుద్దేశించి ‘‘మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంద’’ని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు.
వినాయకుని బుద్ధిసూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలములన్నియూ నారాయణుని అధీనములు. అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ’’ని ప్రార్థించాడు.





