
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Shavukaru Janaki RIP: తెలుగు సినీ పరిశ్రమతోపాటు దక్షిణాది సినీ ప్రేక్షులను ఏడు దశాబ్దాల పాటు అలరించిన అందాల నటి.. నట దిగ్గజం షావుకారు జానకి తీవ్ర అనారోగ్యంతో చెన్నైలో మృతిచెందారు. ఆమె మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. ఆమె మృతికి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు సంతాప ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను ప్రారంభించిన షావుకారు జానకి దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు. ‘షావుకారు’ సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని గుర్తుచేస్తూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు' అని కొనియాడారు. 'షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిది' అని తెలిపారు. భగవంతుడు ఆమెకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ సీఎం సంతాప ప్రకటన షావుకారు జానకి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రార్థించారు. షావుకారు జానకి మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని టీడీఈప అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. '400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షావుకారు జానకి భౌతికంగా మనకు దూరమైనా.. ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారు' అని కొనియాడారు. షావుకారు జానకి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని ప్రకటించి.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ ఘన నివాళి నట దిగ్గజం జానకమ్మకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. 'తన తొలి సినిమా `షావుకారు` పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటి జానకమ్మ. ఏడు దశాబ్దాలకు పైగా పలు భాషల్లో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె కన్నుమూత దక్షిణ భారత చిత్రసీమకు తీరని లోటు. జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా' అని ఎక్స్‌లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పోస్టు చేశారు.
తెలంగాణ ఎమ్మెల్సీ సంతాప ప్రకటన షావుకారు జానకి మృతిపై తెలంగాణ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంతాప ప్రకటన విడుదల చేశారు. ఆమె మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. 'దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఏడు దశాబ్దాలకు పైగా తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి మరణం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు తీరని లోటు. సహజమైన నటన, అద్భుతమైన హావభావాలతో అనేక తరాల ప్రేక్షకుల మనసుల్లో ఆమె చెరగని ముద్ర వేశారు' అని తెలిపారు.
'తెలుగు సినిమాతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ విశిష్ట పాత్రలు పోషించి, భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప కళాకారిణి షావుకారు జానకి. ఆమె మృతి సినీ కళారంగానికి, అభిమానులకు తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో షావుకారు జానకి కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబసభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు.
నారా లోకేశ్ సంతాపం 'ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మృతికి సంతాపం తెలియజేస్తున్నా. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. షావుకారు సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా' అని నారా లోకేశ్ తెలిపారు.





