
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Medico Priyanka Dies: సినిమా థియేటర్ వద్ద చెలరేగిన చిన్న వివాదం ఓ మెడికో విద్యార్థి ప్రాణానికి తీసుకుంది. ఏపీలోని రాజమండ్రిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ఆమె ప్రాణం కోల్పోయారు. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ప్రసాదిత్యా మాల్ వద్ద ప్రియాంకపై కారు ఎక్కించి యువకులు దుష్యంత్, ఆండ్రూ దారుణానికి పాల్పడ్డారు.
రాజమండ్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రియాంకను చేర్పించారు. ప్రాణాలతో పోరాడి ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఆమె కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. కారు నడిపిన తాగుబోతుల దాష్టీకానికి ప్రియాంక ప్రాణం గాల్లో కలిసిపోయింది. కార్ టైర్ మెడపై నుంచి వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయ్యి ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. రాజమండ్రిలో ప్రమాదానికి గురయిన తర్వాత మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగానే ఉండడంతో రాజమండ్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అప్నియా టెస్ట్ కు ప్రియాంక శరీరం సహకరించపోవడంతో సోడియం లెవల్స్ 16 కన్నా తక్కువగా ఉండడంతో ఆమె మరణించారు.
మృతురాలి తండ్రి కన్నీరు మున్నీరు యువకుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ మీకు ఆడపిల్లలు లేరా! అని ప్రశ్నించారు. ప్రతి నెలా హైదరాబాద్ వస్తారు కదా... మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా? అని నిలదీశారు. తన కుమార్తె గురించి ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడం దారుణం అని మండిపడ్డారు. 'ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరి అయిపోయాయి. సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కారుతో రెండుసార్లు గుద్ది మూడోసారి తొక్కించి స్పందించకుండా వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నా నిందితుల మీద కేసు పెట్టకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేశారు? ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. హత్యాయత్నం' అని ప్రియాంక తండ్రి వెంకటేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
తన కుమార్తెపై నమోదైన కేసులో సెక్షన్లు తక్కువ శిక్షకు సంబంధించనివి ఉన్నాయని.. శిక్షలు పడేలా విచారణ జరుగుతుందా అనే దానిపై మృతురాలి తండ్రి వెంకటేశ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే అని ప్రకటించారు. తప్పతాగి ఇలాంటి ప్రమాదాలు చేసేవారిని వదిలిపెట్టకూడదని ప్రియాంక తండ్రి వెంకటేశ్ తెలిపారు. 'కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి, ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు' అని ప్రియాంక తండ్రి వెంకటేశ్ తెలిపారు.
రాజమండ్రి పోలీసుల స్పందన ఆమెకు జరిగింది ప్రమాదం కాదని, ఓ మాల్లో నిందితులతో ప్రియాంక వాగ్వాదానికి దిగిందని, ఆ కోపంతో ప్రియాంకను చంపేందుకు ప్రయత్నించారని పోలీసుల ప్రకటించారు. ప్రియాంకను ప్రమాదానికి గురిచేసిన దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌పై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిశోర్ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా నిందితులు ప్రియాంకను ఢీకొట్టారని తెలిస్తే హత్యాయత్నం కేసును హత్యకేసుగా మారుస్తామని వివరణ ఇచ్చారు.





