
ఇంటర్నెట్ డెస్క్: తాను మొదట ‘టాక్సిక్’ సినిమాకు అంగీకరించలేదని నయనతార అన్నారు. దర్శకురాలు తనను ఎన్నో ప్రశ్నలు వేశారని ఆమె తెలిపారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ‘టాక్సిక్’ (Toxic) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నయనతారతో పాటు కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి కొన్ని విషయాలు పంచుకున్నారు.
‘టాక్సిక్’లో నయనతార ‘గంగ’ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘గీతు ఈ ప్రాజెక్ట్ కోసం ఫోన్ చేసినప్పుడు నేను (Nayanthara) అంత ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. సాధారణంగా ఎక్కువ మంది స్టార్లు ఉన్న సినిమాలను ఎంచుకోవడానికి కొంచెం భయపడతాను. అందుకే ‘నేను ఈ సినిమా చేయలేను’ అని చెప్పేశాను. కానీ, గీతు నన్నుఎన్నో ప్రశ్నలు అడిగారు. చివరికి ‘సరే వచ్చి కథ చెప్పండి’ అని అంగీకరించా. కథ వినిపించిన క్షణం నుంచి నా ఆలోచన మారిపోయింది. ఇంత గొప్ప దర్శకురాలిని మనం ఇప్పటివరకూ ఎందుకు చూడలేదు అనిపించింది. యశ్ ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. తన జీవితంలో 4,5 ఏళ్ల కష్టాన్ని, సమయాన్ని ధారపోశారు. తన కుటుంబం, పిల్లలు, వ్యక్తిగత సంతోషాలను పక్కనపెట్టి సినిమా కోసమే జీవించారు’’ అని నయతార ప్రశంసించారు.
ఇక ఈ సినిమాలో నటించిన కియారా అడ్వాణీ (Kiara Advani), రుక్మిణి వసంత్ కూడా టాక్సిక్ గురించి మాట్లాడారు. ఈ సినిమా తన కెరీర్ను మలుపు తిప్పుతుందని కియార అన్నారు. ‘‘ఒక నటిగా నేను ఎంత గొప్ప సాహసం చేయగలనో నాకే తెలియని సమయంలో.. యశ్ నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ‘టాక్సిక్’ కంటే ముందు, తర్వాత కియార అని చెప్పేలా నా కెరీర్ మారబోతోంది. చిత్రబృందం నన్ను ఎంతో గారాబంగా చూసుకుంది. ఈ సినిమాలో నటించిన తర్వాత ఇలాంటి మంచి పాత్రలు చేయాలనే తపన పెరిగింది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో ‘టాక్సిక్’ రూపొందించాం’’ అని కియార అన్నారు.
‘టాక్సిక్’ అంగీకరించినప్పటి నుంచి తనను అందరూ చాలా గొప్పగా చూస్తున్నారని హ్యూమా ఖురేషి (Huma Qureshi) అన్నారు. ఎక్కడకు వెళ్లినా ఈ సినిమా గురించే అడుగుతున్నారని తెలిపారు. ఈ సినిమాలో నటించడమే తన విజయంగా భావిస్తానని రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) అన్నారు. యశ్ అభిమానిగా తాను ఈ సెట్లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





