శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘ అగధ ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. మరి ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది? కథ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం. కథ మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఎప్పుడూ కూడా దేవీ ఆరాధనలో ఉంటుంది. చుట్టూ ఉండే వారి సమస్యల్ని తీరుస్తూ, ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. అలాంటి మహాదేవి తన కుటుంబానికి కష్టం రావడంతో సొంతూరికి వస్తుంది. మహిమ (ఉల్కా గుప్తా) ఆత్మహత్య చేసుకోవడం, ఆమె గర్భంలోని బిడ్డ కూడా చావడం మహాదేవిని ఆలోచనల్లో పడేస్తుంది. ఈ ఇంటికి ఏదో కీడు జరుగుతోందని మహాదేవి గ్రహిస్తుంది. అదే క్రమంలో తన బాబాయ్(భాను చందర్), పిన్ని సుశీల (వనితా విజయ్ కుమార్) కూతురు హరిణి (జోవికా విజయ్ కుమార్) వింత ప్రవర్తన మరింత అనుమానాన్ని కలిగిస్తుంది. మహిమ ఆత్మ ఘోషను మహాదేవి వింటుంది. మహిమ ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి)లోనూ వింత ప్రవర్తను మహాదేవి కనిపెడుతుంది. అసలు ఈ వీరంతా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంటారు?, మహిమ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది?, ఈ అగధ ఎవరు?, అగధను చేరుకునేందుకు మహాదేవి గురువు బాబా (షిజు) చేసిన త్యాగం ఏంటి? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే. దైవం, దుష్టశక్తి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌లో ప్రారంభం, ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. దుష్టశక్తి ఎంత చెలరేగినా సరే చివరకు దైవం చేతిలో ఓడిపోవాల్సిందే. మన సినిమాల్లో ఎండింగ్ అలానే ఉంటుంది. అయితే దైవశక్తిని చూపించే తీరు, దుష్టశక్తి చేసే విధ్వంసం, దాని మూలాన వచ్చే సమస్యలు ఇవే సినిమాని ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి. కానీ ఈ ‘అగధ’లో అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఏమీ కనిపించవు. ఎక్కడా కూడా ఓ కొత్త సీన్, వావ్ అనిపించేలా ఓ ఎపిసోడ్ ఉన్నట్టు కనిపించదు. మహిమ పాత్రతో సినిమాని ఓపెన్ చేయడం, గుహ చుట్టూ జరిగే ఎపిసోడ్‌తో సినిమాని ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మహాదేవి పాత్రను పరిచయం చేయడం, ఆమె గొప్పదనం చాటేలా ఓ సీన్ పెట్టడం, ఆ తర్వాత తన ఊర్లోని కుటుంబానికి సమస్య రావడం అంటూ మెల్లిగా కథ ముందుకు సాగుతుంది. కానీ ఎక్కడా కూడా ఆసక్తికరంగా కనిపించదు. ఇక ఆత్మను బంధించి.. చెప్పించే ఫ్లాష్ బ్యాక్ కూడా ఏమంతా గొప్పగా అనిపించదు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మరింత సాదాసీదాగా అనిపిస్తుంది. మాటల్లో ఎంతో బిల్డప్ ఇచ్చిన అగధ.. చేతల్లో మాత్రం ఏమీ చూపించదు. అగధకి ఇచ్చిన బిల్డప్ చూస్తే సెకండాఫ్ ఓ రేంజ్లో ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది. దైవ శక్తి బలాన్ని సరిగ్గా చూపించలేదు అలానే దుష్ట శక్తి చేసే విధ్వంసం, అరాచకాన్ని కూడా అంత ఎఫెక్టివ్‌గా చూపించలేదు. ఏ సీన్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉండదు. పైగా ఇవన్నీ ఇల్లాజికల్‌గా, సిల్లీగానే అనిపిస్తాయి. అసలు అగధ అనే వరల్డ్‌ను క్రియేట్ చేయడంలోనే లోపం ఉన్నట్టుగా కనిపిస్తోంది. క్లైమాక్స్ కూడా చాలా వీక్‌గా అనిపిస్తుంది. రెండో పార్ట్ కోసం కథను చాలా వరకు దాచిపెట్టారా? అన్నట్టుగా అనిపిస్తుంది. నటీనటులుగా కామాక్షి భాస్కర్ల తనకు ఇచ్చిన మహాదేవి పాత్రకు న్యాయం చేసింది. చాలా వరకు ఇంటెన్స్ లుక్‌లోనే కనిపించింది. అయితే ఎప్పుడూ ఒకే ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్నట్టు అనిపిస్తుంది. శ్రవణ్ రెడ్డి విలనిజం కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. జోవికాకి రెండు, మూడు సీన్లు బాగానే వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. వనిత, భాను చందర్ల పాత్రలు అంత ప్రభావవంతంగా ఉండవు. మహిమ పాత్రలో ఉల్కా గుప్తా ఓకే అనిపిస్తుంది. షిజుకి కూడా కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర లభించింది. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌గా చూసుకుంటే.. అగధ బెటర్‌గా కనిపిస్తుంది. విజువల్స్ బాగుంటాయి. ఆర్ఆర్ మెప్పిస్తుంది. ఆర్ట్ వర్క్ బాగుంటుంది. మాటలు అంత గుర్తు పెట్టుకునేలా ఉండవు. నిర్మాణ విలువలు బాగుంటాయి. టెక్నికల్ టీం ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు.చివరగా ‘అగధ’లో బ్లాక్ మ్యాజిక్ ప్రభావవంతంగా అనిపించదు.. తెరపైనా ఎంఎస్ రాజు మ్యాజిక్ కనిపించదు.





