
ఒక భవనం పైకప్పు మీద ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపిస్తున్నారు.
ఒకరు టామ్ క్రూజ్. మరొకరు బ్రాడ్ పిట్. కెమెరా వాళ్ల చుట్టూ తిరుగుతోంది. ఇద్దరి కదలికలు సహజంగా ఉన్నాయి. ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఫైట్‌లో వచ్చే చిన్న చిన్న బాడీ మూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీరందరూ దాదాపు చూసింది.
చూస్తే అది ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా నుంచి కట్ చేసిన సీన్‌లాగే అనిపిస్తుంది. కానీ… ఆ ఫైట్ అసలు జరగలేదని తెలుసు. టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ కలిసి ఆ సీన్ చేయలేదు. ఏ సినిమా షూటింగ్‌లోనూ అది తీయలేదు. కేవలం ఒక AI టూల్ దాన్ని సృష్టించింది.
ByteDanceకు చెందిన Seedance AI వీడియో మోడల్‌తో రూపొందిన ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, చాలామందికి అది కేవలం మరో AI వీడియోగానే కనిపించింది.
అయితే హాలీవుడ్‌కు మాత్రం అందులో మరో విషయం కనిపించింది. సినిమా సృష్టించే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న గీత ఒక్కసారిగా చెరిగిపోతోందని. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి సీన్ కోసం నటులు కావాలి. కెమెరా కావాలి. లొకేషన్ కావాలి. స్టంట్ టీమ్ కావాలి. VFX నిపుణులు కావాలి. భారీ బడ్జెట్ కావాలి. ఇప్పుడు ఒక ప్రాంప్ట్‌తో ఇలాంటి విజువల్‌ను తయారు చేయగలిగితే… అసలు సినిమా పరిశ్రమలో ఎవరి హక్కులు ఎక్కడ మొదలవుతాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు Hollywoodను, AI కంపెనీలను ఒకే టేబుల్ దగ్గరకు తీసుకొచ్చింది.
హాలీవుడ్ స్టూడియోలకు తమ సినిమాలు, పాత్రలు, ఫ్రాంచైజీలు కేవలం కథలు కాదు. అవే బిలియన్ డాలర్ల విలువైన intellectual property. AI వాటిని అనుమతి లేకుండా ఉపయోగించి కొత్త వీడియోలు తయారు చేస్తే, ఆ సృష్టికి హక్కు ఎవరిది? ఇది కేవలం ఒక లీగల్ ప్రశ్న కాదు. రేపటి సినిమా బిజినెస్ కు పెద్ద తలనొప్పిగా మారుతున్న సమస్య కూడా.
Seedance తో చేసిన AI వీడియోలు వైరల్ అవుతున్న సమయంలో Motion Picture Association (MPA) రంగంలోకి దిగింది. AI కంపెనీలు సాంకేతికంగా ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నాయో అర్థం చేసుకున్న Hollywood, మరో విషయం కూడా గ్రహించింది. AIని పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదు.కానీ AIకి హద్దులు పెట్టవచ్చు.
ఇదే తరహా వివాదాలు ఇతర AI వీడియో మోడళ్ల చుట్టూ కూడా కనిపించాయి. AI వీడియో టెక్నాలజీ వేగంగా మెరుగవుతున్న కొద్దీ, “ఏది inspiration? ఏది infringement?” అనే ప్రశ్న మరింత క్లిష్టంగా మారుతోంది.
ఇక్కడే ఈ కథలో మరో ఆసక్తికరమైన మలుపు ఉంది. వివాదం వచ్చినందుకు ByteDance Seedanceను పక్కన పెట్టలేదు. దానికి బదులుగా AI వీడియో టెక్నాలజీపై మరింత పెట్టుబడి పెడుతోంది. Google, OpenAI వంటి సంస్థలు AI వీడియో రంగంలో పోటీ పడుతున్న సమయంలో ByteDance కూడా Seedanceను కీలకమైన ఉత్పత్తిగా చూస్తోంది.
అంటే కంపెనీకి స్పష్టమైన లెక్క ఉంది. AI వీడియో భవిష్యత్తు అని తెలుసు. అయితే ఆ భవిష్యత్తులోకి వెళ్లాలంటే Hollywoodతో నిరంతరం గొడవపడటం వ్యాపారపరంగా కూడా మంచిది కాదు. అక్కడే ఇప్పుడు కొత్త మార్గం కనిపించింది.
కొన్ని నెలల పాటు MPA, ByteDance మధ్య చర్చలు జరిగాయి. చివరకు ఆ చర్చలు Memorandum of Understanding (MOU) వరకు వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం ByteDance తన AI టెక్నాలజీ, ప్లాట్‌ఫామ్‌లలో Hollywood intellectual propertyకి మరింత బలమైన guardrails ఏర్పాటు చేయడానికి MPAతో కలిసి పనిచేయనుంది.
ఇది Seedanceకే పరిమితం కాదు. Seedance, Seedream 5.0 Lite, TikTok, CapCut, Dreamina వంటి ByteDance ఉత్పత్తులు కూడా ఈ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి వస్తాయి.
AI ఇక సినిమా పరిశ్రమ బయట నిలబడి ఉన్న టెక్నాలజీ కాదు. అది సినిమా గేటు లోపలికి వచ్చేసింది. ఇప్పుడు Hollywood చేస్తున్న పని దాన్ని బయటకు పంపడం కాదు. లోపలికి వచ్చిన AIకి గేట్లు ఎక్కడ ఉండాలో నిర్ణయించడం. ఆ మార్పుకు సంకేతంగా నిలిచిపోయింది… ఒక 15 సెకన్ల వైరల్ వీడియో. అదిదా సర్పైజ్.





