
కరోనా మహమ్మారి, ఓటీటీల రాకతో ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడమే మానేశారు. జేబులు గుళ్ల చేసుకుని థియేటర్‌లోకి వెళ్లినా కంటెంట్ నచ్చడం లేదు. భారీ బడ్జెట్ చిత్రాలు బొక్కా బోర్లా పడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలైనా సరే.. ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు. అయితే కంటెంట్ బాగుంటే స్టార్‌లు ఉన్నా లేకున్నా.. చిన్న సినిమాలైనా సరే వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లీష్‌లో వచ్చిన అబ్సేషన్ మూవీ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 2200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ కోవలోకే వస్తుంది హనుమాన్ అన్ష్. కేవలం 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సంచలన విజయం నేపథ్యంలో హనుమాన్ అన్ష్ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హనుమాన్ అన్ష్‌లో శోభినవ్ సత్య, విహన్ షెడ్గే, చందన్ కే ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి తదితరులు కీలకపాత్రలు పోషించగా విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు రాగిని ఎస్, నమ్రత జీ సింగ్, అనుప్రియ ఏ నగర్, విశాల్ చతుర్వేది నిర్మాతలుగా వ్యవహరించారు. శంక్ రాజ్యధ్యక్ష సినిమాటోగ్రాఫర్‌గా.. సాధు తివరా, రిషి పాఠక్, శ్రేయస్ ధర్మాధికారిలు సంగీతం.. ధీరేంద్ర ముకల్వార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఆగస్ట్ 7న హనుమాన్ అన్ష్ విడుదలైంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి హనుమాన్ అన్ష్‌ను 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలుత చిన్న సినిమా అనుకుని జనం ఈ థియేటర్‌ వైపు కూడా చూడలేదు. తొలిరోజు కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. తొలి వారం 1.08 కోట్ల రూపాయలు, రెండో వారం 40 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. దాంతో ఈ సినిమాకు చాలా చోట్ల స్క్రీన్లు తగ్గించేశారు. కానీ మూడో వారం నుంచి పరిస్థితులు మారిపోయాయి. కొద్దిపాటి థియేటర్లకు జనం పోటెత్తారు, కొంతమంది మళ్లీ మళ్లీ చూడటం మొదలుపెట్టడంతో కలెక్షన్ల వర్షం కురిసింది.
మూడో వారంలో 10.40 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 61 కోట్ల రూపాయలు, ఐదో వారం 90.25 కోట్ల రూపాయలు, 36వ రోజున 10.50 కోట్ల రూపాయలు, 37వ రోజున 18.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియాలో 193 కోట్ల రూపాయల నెట్.. 227 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఏకంగా 9.50 కోట్ల రూపాయల రాబట్టింది. భారత్‌లో వచ్చిన కలెక్షన్స్‌తో కలిపి హనుమాన్ అన్ష్‌కి ఇప్పటి వరకు 236.50 కోట్ల రూపాయలు వసూలైంది. ఈ మూవీ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే 300 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేయొచ్చని అంటున్నారు.
1900-1973 మధ్యకాలంలో జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు అయిన నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ హనుమాన్ అన్ష్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో 8 చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సినిమాను చూడమని కోరారు. అలా క్రమంగా ఎవరూ పట్టించుకోని ఈ సినిమాను సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆదరించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా వారి అనుభూతిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఒక్క హిందీలోనే ఇలాంటి సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్ అన్ష్ చిత్రాన్ని ప్రాంతీయ భాషలలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 18న ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ హనుమాన్ అన్ష్ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ విజయం నేపథ్యంలో హనుమాన్ అన్ష్ నిర్మాతలు భారీగా లాభాలను కళ్లజూస్తున్నారు. పెట్టుబడికి వందల రెట్లలో ప్రాఫిట్స్ అందుకుంటున్నారు.
తాజాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనుప్రియ తన సంతోషాన్ని తెలియజేశారు. నా వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న డబ్బుతో ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఇంతటి సంపదను మెయింటైన్ చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు, ఆర్ధికంగా వెనుకబడిన పిల్లల కోసం వెచ్చించాలని అనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో అనుప్రియ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అనుప్రియ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
