
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Chandrababu Naidu: సినిమా థియేటర్‌కు వెళ్లి చిన్న వివాదంలో కారుతో ఢీకొట్టడంతో రాజమండ్రలిలో మెడికో ప్రియాంక బ్రెయిన్ డెడ్‌కు గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర సంచలనం రేపుతోంది. బాధితురాలిని కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏమాత్రం ముందుకురాకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందగా సీఎం చంద్రబాబు స్పందించారు.
రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందని సంతాప ప్రకటన చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
ప్రియాంక ఘటనపై ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని సీఎం చంద్రబాబుకు ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ఇతరత్రా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని సీఎం అండగా నిలిచారు.
రేపు రాజమండ్రిలో బంద్ మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రియాంకను ప్రమాదానికి గురి చేసిన తర్వాత 3 రోజుల పాటు నిందితులపై కేసు పెట్టకుండా పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారు. ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మంత్రి అనిత ఎవరూ కూడా కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదు. వైద్య చికిత్స ఖర్చులకు కనీసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయలేదు. నిందితులను కాపాడేందుకు ఎన్ని సూట్‌కేసులు తీసుకున్నారు? పోలీసుల వెనక ఉండి ఇదంతా నడిపించింది ఎవరు? ప్రియాంకకు న్యాయం జరగాలి' అని డిమాండ్ చేశారు. ప్రియాంక మృతికి నిరసనగా రేపు రాజమండ్రిలోని అన్ని విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొనాలి మాజీ ఎంపీ మార్గాని భరత్ పిలుపునిచ్చారు.





