
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో ఎలక్ట్రిక్ కార్లు ఖరీదైనవిగా ఉండేవి. కానీ ఇప్పుడు కంపెనీలు అందుబాటు ధరలలో ఈవీలను విడుదల చేస్తున్నాయి. టాటా, ఎంజీ వంటి కంపెనీలు బడ్జెట్ శ్రేణిలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నాయి. వియత్నాంకు చెందిన సుప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహన సంస్థ అయిన విన్‌ఫాస్ట్ కూడా ఇండియాలో అందుబాటు ధరలలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. భారత మార్కెట్లో తన గ్లోబల్ మోడళ్లను విడుదల చేయడానికి బదులుగా ఈ కంపెనీ ఇప్పుడు ప్రత్యేకంగా భారత్ కోసం రూపొందించిన రెండు కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై పనిచేస్తోంది.
అందులో భాగంగా భారత వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా రూ.10 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధరతో కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు ఈవీలకు అంతర్గతంగా VF X, VF Y అనే కోడ్‌నేమ్‌లు పెట్టారు. ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి ప్రస్తుతం కొనసాగుతోంది. విడుదలైన తర్వాత విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కారు టాటా పంచ్ ఈవీ, ఎంజీ కామెట్ వంటి వాహనాలతో పోటీపడుతుంది. విన్‌ఫాస్ట్ రాబోయే ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
VF X: ఇది రూ.10 లక్షల కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధర విభాగంలో రానుంది. సైజు పరంగా ఇది కంపెనీ చెందిన 'VF 6' మోడల్ కంటే చిన్నదిగా ఉంటుంది.
VF Y: ఈ రెండో మోడల్ అభివృద్ధి ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. భవిష్యత్తులో దీనికి సంబంధించిన మరిన్ని వెల్లడి కానున్నాయి.
మార్కెట్ పోటీ రూ.10 లక్షల బడ్జెట్ శ్రేణిలో విడుదల కానున్న ఈ కారు ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్న టాటా పంచ్ ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ, టాటా టియాగో ఈవీ మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. విన్ ఫాస్ట్ మొదట VF 3, VF 6, VF 7 మోడళ్లను ఇక్కడే తయారు చేయాలని అనుకున్నప్పటికీ.. అధిక ఉత్పత్తి వ్యయాల కారణంగా ఆ ప్లాన్‌ను కొంత మార్చింది. VF 6, VF 7 మోడళ్లను 'కంపెలీటి నాక్డ్-డౌన్'(CKD) కిట్ల రూపంలో దిగుమతి చేసుకుని ఇండియాలోనే అసెంబుల్ చేస్తారు. ధరలను తగ్గించి భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా మార్చడానికి దాదాపు 300కు పైగా స్థానిక విడిభాగాల సరఫరాదారులతో కంపెనీ చర్చలు జరుపుతోంది.
భారీ పెట్టుబడి, తమిళనాడు తయారీ ప్లాంట్ భారత మార్కెట్‌పై విన్ ఫాస్ట్ భారీ నమ్మకంతో ఉంది. ఇండియాలో దాదాపు 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16,500 కోట్లు) పెట్టుబడి పెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులోని తూత్తుకుడి వద్ద ఉన్న విన్ ఫాస్ట్ తయారీ ప్లాంట్ రెండో దశ పనులకు కూడా ఆమోదం లభించింది. ప్రారంభంలో ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 50,000 యూనిట్లు కాగా.. డిమాండ్‌కు అనుగుణంగా దీనిని 1.5 లక్షల యూనిట్లకు పెంచే అవకాశం ఉంది.





