Babu Rao Success Story : జీవితంలో ఏమీ లేకుండా ఏదైనా సిటీకి రావడం, తినడానికి ఉండటానికి కూడా ఇబ్బందులు పడటం, తర్వాత ఏదైనా చిన్న పనితో ప్రారంభించి కోట్లకు కోట్లు సంపాదించడం ఇది సినిమాల్లో కనిపించే కథలా అనిపించినా హైదరాబాద్‌లో నిజంగానే జరిగిన ఒక వ్యక్తి ప్రయాణం. అవును హైదరాబాద్‌లో ప్రముఖ ఇరానీ చాయ్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కేఫ్ నిలోఫర్ వెనుక ఉన్న ఏ. బాబు రావు ప్రయాణం ఇలాంటిదే. 1975 సంవత్సరంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన చేతిలో పెద్దగా డబ్బు లేదు. ఉద్యోగం కోసం టికెట్ లేకుండానే రైలులో హైదరాబాద్ చేరుకున్న ఆయనకు మొదట టెక్స్టైల్ షాపులో సేల్స్‌మెన్‌గా ఒక పని దొరికింది. ఇక ఉద్యోగం వచ్చిన వెంటనే ఉండటానికి ఇల్లు దొరకలేదు. దాదాపు 15 రోజుల పాటు ఫుట్‌పాత్‌పైనే నిద్రించిన ఆయన స్నానం చేసేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌ను ఉపయోగించేవారని తెలిసింది. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రయాణం దాదాపు 5 దశాబ్దాల్లో కేఫ్ నిలోఫర్ అనే పెద్ద బ్రాండ్‌గా మారింది.టెక్స్టైల్ షాపు నుంచి రెస్టారెంట్ వరకుహైదరాబాద్ వచ్చిన తర్వాత బాబు రావు తొలుత టెక్స్టైల్స్ షాపులో సేల్స్‌మెన్‌గా చేరగా తర్వాత రెస్టారెంట్ ఉద్యోగంలో చేరారు. అక్కడే ఆయనకు సదరు వ్యాపారం ఎలా నడుస్తుంది. కస్టమర్లను ఎలా చూసుకోవాలి? రోజువారీగా నిర్వహణ ఎలా ఉంటుంది. ఇలా అన్ని విషయాలపై అవగాహన వచ్చింది. అదే సమయంలో ఒక కస్టమర్ ఆయన పనితీరును గమనించారు. కొత్తగా ప్రారంభమైన ఒక కేఫ్‌లో బాబు రావు బాగా పనిచేస్తారని భావించి అక్కడ ఉద్యోగం ఇప్పించారు. అదే కేఫ్ నిలోఫర్.ఇక బాబు రావు కేఫ్ నిలోఫర్‌లో తొలుత వెయిటర్‌గా చేరారు. అయితే ఆయన పని కేవలం కస్టమర్లకు చాయ్ ఇవ్వడంతోనే ముగియలేదు. అవసరమైనప్పుడు కేఫ్‌ను శుభ్రం చేయడం, పాత్రలు కడగటం వంటి పనులు కూడా చేసేవారు. పనేదైనా వెనుకాడకుండా చేయడం, బాధ్యతగా వ్యవహరించడం వల్ల కేఫ్ యజమాని నమ్మకాన్ని పొందారు. కాలక్రమంలో కేఫ్ నిర్వహణ బాధ్యతలు కూడా బాబు రావుకు అప్పగించారు. తర్వాత యజమాని వ్యాపారం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కేఫ్‌ను బాబు రావుకే అప్పగించారు. ఇలా 1978లో కేఫ్ నిలోఫర్ బాధ్యతలు తీసుకోగా తర్వాత కొంత మొత్తం చెల్లించి కొన్నేళ్లలో పూర్తిగా తనే యజమానిగా మారారు. ABR కేఫ్ అండ్ బేకర్స్ పేరిట నిర్వహిస్తూ వచ్చారు.కేఫ్ నిలోఫర్ ప్రారంభ రోజుల్లో మెనూ సింపుల్‌గా ఉండేది. ఇరాన్ చాయ్, ఉస్మానియా బిస్కెట్లే ప్రధాన ఆకర్షణ. పెద్దగా హంగులు లేకుండా మంచి రుచితో చాయ్ అందించడం ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించింది. క్రమక్రమంగా ఈ చిన్న కేఫ్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు మరింత విస్తరించి బేకరీ ఉత్పత్తులు, కేకులు, స్నాక్స్, ప్యాకేజ్డ్ టీ, టీ పౌండర్ మొదలైనవన వాటిని కూడా విక్రయిస్తోంది. కాలంతో పాటు కేఫ్ నిలోఫర్ వ్యాపార విధానం కూడా మారింది. సంప్రదాయ టీ కేఫ్గానే కాకుండా వివిధ రకాల కస్టమర్లను ఆకర్షించేలా పెద్ద అవుట్లెట్లను ఏర్పాటు చేసింది.Read Also: స్కూల్ డ్రాపౌట్.. రూ. 65 జీతంతో ఉద్యోగం.. ఇప్పుడేమో రూ. 10 వేల కోట్ల సామ్రాజ్యం!2025లో ప్రారంభించిన హైటెక్ సిటీ అవుట్లెట్ ఇందుకు చక్కటి ఉదాహరణ. దాదాపు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అవుట్లెట్ ప్రారంభంలోనే దేశంలోనే అతిపెద్ద టీ కేఫ్‌ల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీంట్లో దాదాపు 700 మందికిపైగా కస్టమర్లు కూర్చునే సామర్థ్యం ఉందని సమాచారం. Tracxn ప్రకారం ABR కేఫ్ అండ్ బేకర్స్ ఆదాయం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 25 కోట్ల వరకు ఉండగా, 2024-25 నాటికి రూ. 206 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలోనే కంపెనీ ఆదాయం దాదాపు 8 రెట్లకుపైగా పెరిగినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక కంపెనీ విలువ సుమారు రూ. 1500 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం.గమనిక: కంపెనీ విలువ, ఆదాయం వంటి గణాంకాల్ని సంబంధిత థర్డ్ పార్టీ డేటా లేదా మీడియా నివేదికల ఆధారంగా పేర్కొన్నవే.





