
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Brahmanandam:హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన కామెడీతో ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. వేలాది సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన మీమ్స్, కామెడీ సన్నివేశాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా బ్రహ్మానందం అన్నయ్య శ్రీనివాసరావు మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాను బ్రహ్మానందం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం ఆశించడం లేదని, కేవలం అప్పుడప్పుడు ఫోన్ చేసి ప్రేమగా పలకరిస్తే చాలని శ్రీనివాసరావు తెలిపారు. తమది ఆరుగురు అన్నదమ్ముల కుటుంబమని, వారిలో ప్రస్తుతం తామిద్దరే ఉన్నామని చెప్పారు. వృద్ధాప్యంలో తమ్ముడి నుంచి ఒక ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పడం భావోద్వేగానికి గురిచేసింది.
బ్రహ్మానందం తనను కలవడానికి రావాల్సిన అవసరం లేదని, ఆయన వస్తే అభిమానులు, జనసందోహం కారణంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తనను హైదరాబాద్‌కు పిలిపించి ఒక్కసారి కలిస్తే చాలని చెప్పారు. తన కుమార్తెలే ప్రస్తుతం తనను చూసుకుంటున్నారని, తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని వివరించారు.
అయితే ఇదే సమయంలో బ్రహ్మానందం తమ కుటుంబానికి చేసిన సాయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. తాను ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని బ్రహ్మానందమే నిర్మించారని తెలిపారు. తన ముగ్గురు కుమార్తెల వివాహాలను కూడా తమ్ముడే నిర్వహించారని చెప్పారు. కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా బ్రహ్మానందం తన స్థాయికి తగ్గట్టుగా సాయం చేశారని వెల్లడించారు.
పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా బ్రహ్మానందం కుటుంబ సభ్యులను ఆదుకునేవారని శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆయన ఉన్నత స్థాయిలో ఉండటంతో తాము చనువుగా మాట్లాడటానికి కొంత సంకోచిస్తామని చెప్పారు. తమ్ముడిపై తనకు ఎలాంటి కోపం లేదని, తన మనసులో ఉన్న బాధను మాత్రమే వెల్లడించానని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
బ్రహ్మానందం చిన్నతనంలో చదువు కోసం అత్తిలి వెళ్లారని, అక్కడ లెక్చరర్‌గా పనిచేశారని శ్రీనివాసరావు గుర్తుచేశారు. ప్రేమ వివాహం చేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులను ఒప్పించి తాము కూడా ఆయనకు అండగా నిలిచామని తెలిపారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావడంతో హైదరాబాద్‌కు వెళ్లి బ్రహ్మానందం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారని ఆయన వివరించారు.
వీడియోలోని పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు బ్రహ్మానందంపై విమర్శలు చేస్తున్నారని, అయితే శ్రీనివాసరావు మాటల్లో తమ్ముడిపై ప్రేమ, అనుబంధం మాత్రమే కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





